AP: CM YS Jagan Speech In Meeting With Film Celebrities Detail In Telugu - Sakshi
Sakshi News home page

AP CM: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం జగన్‌ ఏమన్నారంటే..?

Published Thu, Feb 10 2022 4:18 PM | Last Updated on Thu, Feb 10 2022 8:59 PM

CM YS Jagan Speech In Telugu Film Celebrities Meeting - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐఎండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే... :
‘‘మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ... దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా నాతో పంచుకున్నారు.

ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని..  ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్‌ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక  ప్రాతిపదిక లేనంతవరకు... కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ఈ పాయింట్‌ను కూడా చర్చించాను. నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. మంచి ధరలు తీసుకురావడం జరిగింది.

ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే... అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో పారితోషకం, హీరోయిన్‌ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్‌ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్‌ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని చెప్పాం. 

ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్‌ చేయడం కోసం కొంత పర్సెంటేజ్‌ కేటాయించాం. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్‌ చేయడం కోసం... ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయి. కనీసం ఎంత శాతం షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారు. 

రేట్లకు సంబంధించినంత వరకు... అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్‌ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం.  ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్‌ ఇస్తుంది. నెలకు సగటున రూ.80లు పడుతుంది. దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మార్పు చేశాం. 

మరొక్క అంశం...మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్‌ అవుతుంది. ఆ పాయింట్‌ అర్ధం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉంది.

నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా.  నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం.

విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి... అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. 

రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా క్లిక్‌ కావాలంటే పండగ రోజు రిలీజ్‌ చేస్తే హిట్‌ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా  కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమనుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నాం. ఆ పండగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా... కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని’’ సీఎం జగన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement