సాక్షి, అమరావతి : వంశధార, జంఝావతి నదీ జలాల్లో వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒడిశా సర్కార్‌తో సంప్రదింపులు జరిపి వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో కీలకమైన నేరడి బ్యారేజీ.. జంఝావతి రబ్బర్ డ్యామ్ స్థానంలో స్పిల్ వే నిర్మించడం ద్వారా వాటా జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. నేరడి బ్యారేజీ, ఝంజావతి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి.. వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చదవండి: రేపు రెండో విడత రైతు భరోసా ప్రారంభం
నేరడిపై ఒడిశా అభ్యంతరం..
శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి ఎనిమిది వేల క్యూసెక్కులను కొత్తగా నిర్మించే సింగిడి రిజర్వాయర్ (0.686 టీఎంసీలు), పారాపురం రిజర్వాయర్ (0.404 టీఎంసీలు), హిరమండలం రిజర్వాయర్ (19.05 టీఎంసీలు)లలో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: ‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’
ఒడిశా ప్రతిపాదన మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆర్నెల్లలోగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 6, 2009న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు వంశధార ట్రిబ్యునల్‌ను ఫిబ్రవరి 24, 2010న కేంద్రం ఏర్పాటు చేసింది. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్‌లలో మార్పులు చేసి.. బామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి.. గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలు మళ్లించే పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు.
జంఝావతి వివాదం ఇదీ..
జంఝావతి నదిలో 8 టీఎంసీల నీటి లభ్యతలో చెరి సగం వాడుకునేలా డిసెంబర్ 25, 1978న ఒడిశా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ వాటా నీటిని వినియోగించుకోవడం కోసం విజయనగరం జిల్లాలో జంఝావతిపై కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 3.40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బ్యారేజీ ద్వారా 24,410 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఒడిశాలో ముంపునకు గురయ్యే 1,175 ఎకరాలను సేకరించి అప్పగించడానికి అప్పట్లోనే ఒడిశా సర్కార్ వద్ద ఏపీ ప్రభుత్వం నిధులను డిపాజిట్ చేసింది. కానీ ఒడిశా సర్కార్ భూసేకరణ చేయలేదు. పూర్తిస్థాయి బ్యారేజీ నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చింది. దాంతో జంఝావతి ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు.
సంప్రదింపుల ద్వారా వివాదాలు పరిష్కారం..
వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ సెప్టెంబర్ 13, 2017న ట్రిబ్యునల్ తుది తీర్పును ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒడిశా సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు, వంశధార ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముంపు భూమిని గుర్తించేందుకు జాయింట్ సర్వేకు కూడా ఒడిశా సర్కార్ సహకరించడం లేదు.
ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి... జంఝావతిపై 3.40 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయి బ్యారేజీని నిర్మించడానికి మార్గం సుగమం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment