AP CM YS Jaganmohan Reddy Comments In YSR District Tour, Details Inside - Sakshi
Sakshi News home page

CM Jagan YSR District Tour: ప్రణాళిక మేరకే సంక్షేమాభివృద్ధి

Published Sat, Dec 3 2022 3:14 AM | Last Updated on Sat, Dec 3 2022 8:03 AM

CM YS Jaganmohan Reddy Comments In YSR district Tour - Sakshi

బోటులో నుంచి రిజర్వాయర్‌ అందాలు వీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజల గడప వద్దకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని, పరిపాలన పారదర్శకంగా సాగినపుడే ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు.

వైఎస్సార్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం సతీమణి భారతితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కడపకు చేరుకున్నారు. అనంతరం లింగాల మండలం పార్నపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) వద్ద పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గావించి, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

తొలుత సీబీఆర్‌ వద్ద పర్యాటక శాఖ రూ.4.1 కోట్ల పాడా (పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) నిధులతో అధునాతనంగా నిర్మించిన వైఎస్సార్‌ లేక్‌ వ్యూ రెస్టారెంట్, అందులోని అతిథి గృహాలు, పార్కుతోపాటు రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సీట్ల స్పీడ్‌ బోటు, 18 సీట్ల ఫ్లోటింగ్‌ జెట్టి, పర్యాటక బోటింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు.

ఇందుకు సంబంధించిన శిలా ఫలకాలను, లేక్‌ వ్యూ పార్కులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిజర్వాయర్‌లో జలకళను, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకిస్తూ కొద్దిసేపు సేద తీరారు. పాంటున్‌ బోటులో కూర్చొని కాసేపు రిజర్వాయర్‌లో షికారు చేశారు. లేక్‌ వ్యూ రెస్టారెంట్‌లో జిల్లా నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ఆ శాఖ అధికారులు జిల్లాలోని మేజర్‌ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌)ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకానికి అత్యంత అనువైన ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.   
దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌  

పేరు పేరున పలకరింపు.. 
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, లింగాల మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నేతలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరించారు.

అవినీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆ తర్వాత అందరితో ఫొటోలు దిగారు. సాయంత్రం 5.40 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు.

అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నేతలను పేరుపేరునా పలకరించారు. పలువురి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

చిన్నారి లివర్‌ మార్పిడికి సీఎం భరోసా 
ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్‌ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్‌ జాన్‌ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.

దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు.

వీరి కష్టం విన్న  సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.     
 – సాక్షి ప్రతినిధి, కడప  

నేడు వివాహ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి 
తొలిరోజు పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఇడుపులపాయలో బస చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. శనివారం ఉదయం పులివెందులలోని ఎస్‌పీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement