AP: సమ్మె విరమించండి | Committee of Ministers appeal to Anganwadi workers and helpers | Sakshi
Sakshi News home page

ఏపీ: సమ్మె విరమించండి.. అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి

Published Thu, Dec 28 2023 4:30 AM | Last Updated on Thu, Dec 28 2023 3:02 PM

Committee of Ministers appeal to Anganwadi workers and helpers - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరింది.

గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. వారి  క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్య పరిస్థితి తీసుకురావద్దని కోరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల ప్రయోజనం కోసం తీసుకున్న వివిధ నిర్ణయాలను పునరుద్ఘాటిస్తూ.. మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. అందువల్ల సమ్మెను విరమించాలని కోరింది. 

టీడీపీ హయాంలో ఒక్కపైసా కూడా పెంచలేదు
అంగన్‌వాడీలకు టీడీపీ హయాంలో 2016 ఏప్రిల్‌ 4న అంగన్‌వాడీ కార్యకర్తల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్‌వాడీ సహాయకుల జీతాలు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచారని మంత్రుల బృందం గుర్తు చేసింది. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అంగన్‌వాడీల కష్టాలు చూసి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలను పెంచిందని గుర్తు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో 2019 వరకూ అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్‌వాడీ సహాయ­కురా­లికి, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించిందని వివరించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌­వాడీ కార్యకర్తల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను రూ.7,000కు, అంగన్‌వాడీ సహాయకుల జీతాలను రూ.7,000కు పెంచిందన్నారు. మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.27.80 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రుల బృందం తెలిపింది.

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే తొలిసారిగా పదోన్నతులు ఇచ్చి 560 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేసింది. ఈ పోస్టుల పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. దాంతో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కల్పించిందని వివరించింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించిందని తెలిపింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ తదితర పథకాలతోపాటు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement