![Construction of houses for the poor to reduce electricity bills - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/14/HOME.jpg.webp?itok=pYKDGD1B)
సాక్షి, అమరావతి: పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఎనర్జీ ఎఫిషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్ (ఈఈటీసీ) సాంకేతికతను జోడించే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇదే సందర్భంలో ప్రతి ఇంటికీ 3 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఇంధన పొదుపు సామర్థ్య ఫ్యాన్లను అమర్చాలని నిర్ణయించారు. దీనివల్ల పేదల కోసం నిర్మించే ఇళ్లకు కరెంటు బిల్లు కనీసం 20 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఇంధన పొదుపు శాఖ సమీక్ష
► పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే 30 లక్షల ఇళ్లకు ఈఈటీసీ టెక్నాలజీని జోడిస్తే దేశంలోనే ఏపీ రోల్ మోడల్‌గా నిలుస్తుందని కేంద్ర ఇంధన పొదుపు సంస్థ చైర్మన్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.
► ఈఈటీసీ టెక్నాలజీపై గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఇంధన పొదుపు సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులతో సమీక్ష జరిగింది.
► ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.
ఇండో స్విస్ భాగస్వామ్యంతో..
► నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఆధునిక గృహాలు నిర్మించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్, భారత్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఇండో–స్విస్ ‘బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈపీ)’ ఈ పథకంలో భాగమయ్యేందుకు ఇప్పటికే ముందుకొచ్చింది.
► తాజాగా ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
► ఈఈటీసీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపడితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 4 నుంచి 8 డిగ్రీలు తగ్గటం, 20% విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది.
► ఇదే సందర్భంలో ప్రతీ ఇంటికి 3 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్‌లైట్లు, 2 ఇంధన సామర్థ్య ఫ్యాన్లను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
పేదల జీవన ప్రమాణాలను పెంచేలా..
పేదల జీవన ప్రమాణాలను పెంచే దిశగా అన్ని చర్యలూ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని అజయ్‌జైన్ తెలిపారు.
ఇందుకు అనుగుణంగానే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment