ముంపు నుంచి ‘రక్షణ’ | Construction of retaining wall along Krishna river | Sakshi
Sakshi News home page

ముంపు నుంచి ‘రక్షణ’

Published Fri, Jan 5 2024 4:29 AM | Last Updated on Fri, Jan 5 2024 7:10 AM

Construction of retaining wall along Krishna river - Sakshi

విజయవాడలో కృష్ణానది తీరాన పూర్తయిన రిటైనింగ్‌ వాల్‌.. చురుగ్గా సాగుతున్న సుందరీకరణ పనులు

వర్షం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణం కృష్ణా నది పొంగుతుందో... ఎక్కడ తమ ప్రాంతానికి వరద వస్తుందో... తమ ఇళ్లు ముంపు బారిన పడతాయో... మళ్లీ మా బతుకులు ఎక్కడ అతలాకుతల­ంఅవుతాయోనని ఆందోళన చెందేవారు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్య. అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్నో మారినా ఇక్కడివారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ సమస్యపై దృష్టిసారించారు. అవసరమైన నిధులు మంజూరు చేసి రక్షణగోడ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వేలాదిమంది ప్రజల చింత తీర్చారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలకు వరద ముప్పు నుంచి పూర్తి ఉపశమనం కలగనుంది. ఆర్టీసీ బస్టాండు నుంచి యనమలకు­దురు వరకు వేలాది మంది ప్రజలకు వరద కష్టాలు తొలగనున్నాయి. ప్రకాశం బ్యారేజినుంచి 5లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వదిలితే దిగువ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేవి. ఇప్పు­డు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా ఏ ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మించా­రు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చి­న హామీ మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతవా­సుల ముంపు కష్టా­ల­ నుంచి గట్టెక్కిస్తూ కనక­దుర్గమ్మ వారధినుంచి కో­టి­నగర్‌ వరకు రూ. 122కోట్లతో రక్షణగోడ నిర్మించారు. తాజాగా పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ­వారధి వరకు రూ. 120.82 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.

కృష్ణలంకకు రక్షణ కవచం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతం కృష్ణానదికి వరదలు వచ్చినపుడల్లా ముంపుబారిన పడేది. ఇక్కడి కాలనీ వాసులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వారం, పది­రోజుల పాటు వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే తలదాచుకునేవారు. ఈ సమస్యను ప్రత్యక్షంగా చూసిన సీఎం వైఎస్‌ జగన్‌ రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటి నగర్‌ వరకు 1.2 కిలో మీటర్ల పొడవునా రూ.122.90 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బ్యారేజీ నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతిసారీ చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబపురం వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. రక్షణ గోడ నిర్మాణంతో ఈ ప్రాంత వాసుల కష్టాలు పూర్తిగా తీరాయి.

తుది దశకు పనులు
ప్రస్తుతం పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.070 కిలో మీటర్ల పొడవున రూ120.82 కోట్ల నిధులతో రిటైనింగ్‌ వాల్‌ మూడో దశ పనులు తుది దశకు చేరాయి. దీనివల్ల కృష్ణలంకలోని రణదీప్‌ నగర్, గౌతమి నగర్, నెహ్రూనగర్, ద్వారక నగర్లో నివసిస్తున్న 30 వేల మందికి వరద కష్టం తీరింది.

స్వరూపం 
– ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి యనమలకుదురు వరకు రక్షణ గోడ
– ఇప్పటివరకూ 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం.
– ఇకపై 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు సమస్యే ఉండదు. 
– కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు రూ.122.90 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణం
– తాజాగా పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.070 కిలోమీటర్ల పొడవున రూ.120.82 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తి.

ముంపు సమస్య తీరింది
వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణాన్నైనా వరద వచ్చేస్తుందేమోనని భయాందోళన చెందేవాళ్లం. వరద ఇళ్లలోకి వస్తుండటంతో ఇళ్లు కాళీ చేసి, కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ భయం లేదు. మా కష్టాలు తీరాయి.
–  మండాది దుర్గ, తారకరామనగర్‌

మా జీవితాలకు రక్షణ
వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరకింది. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ సమస్య పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మా వరద కష్టాలను పరిష్కరించి, మా జీవితాలకు రక్షణ కల్పించారు.
– వీర్ల సుభద్రాదేవి, తారకరామనగర్‌

దశాబ్ధాల సమస్య పరిష్కారం
ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కూలీ పనులు చేసుకుంటూ, కృష్ణానది కరకట్టపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద వచ్చినప్పుడల్లా ఇళ్లు కాళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఆ సమస్యలేదు. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. 
– బాపనపల్లి కుమార్, ఆటోడ్రైవర్, భూపేష్‌గుప్తానగర్‌

రిటైనింగ్‌ వాల్‌ పనులు పూర్తయ్యాయి
కృష్ణా నది కరకట్ట వెంబడి రిటైనింగ్‌ వాల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడోదశలో పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి వరకు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. దీని ద్వారా విజయవాడ వాసులకు ముంపు కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. .
– టి.జె ప్రసాద్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ, విజయవాడ

దశాబ్దాల కల నేరవేర్చారు
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగర వాసుల ముంపు కష్టాలు చూసి, వారి కష్టాలకు చెక్‌ పెట్టే విధంగా, కృష్ణానది వెంబడి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. ఇది కృష్ణలంక ప్రజలకు రక్షణ కవచంగా మారనుంది, దీంతో పాటు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా రిటైనింగ్‌ వాల్‌ను అందంగా తీర్చి దిద్దుతున్నారు. దశాబ్దాల కలనేరవేర్చిన ముఖ్యమంత్రికి తూర్పు నియోజక వర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. 
– దేవినేని అవినాష్, తూర్పునియోజక వర్గ ఇన్‌ఛార్జి

కృష్ణాతీరం... ఇక ఆహ్లాదం...
నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా ప్రభుత్వం రిటైనింగ్‌ వాల్‌ వెంబడి పార్కులు, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.38.39 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, పనులు ప్రారంభించారు. ఇప్పటికే రిటైనింగ్‌ వాల్‌ వెంబడి బండ్‌ పనులు పూర్తయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement