సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తాగునీరు అందించడానికి చేపట్టిన ఏలేశ్వరం–విశాఖ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడుగు ముందుకుపడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీలో భాగంగా డ్రోన్ సర్వేకి సన్నాహాలు మొదలయ్యాయి. ఏలేశ్వరం నుంచి విశాఖకు సుమారు 130 కిలోమీటర్లు పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో మూడు నదుల్లోంచి పైప్‌లైన్ నిర్మించాల్సి ఉండటం అత్యంత కీలకమైన అంశం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న వ్యాప్‌కోస్ డ్రోన్ సర్వే బాధ్యతను ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. సర్వేకు సంబంధించిన సామగ్రి ఏలేశ్వరం చేరుకుందని, సర్వే కోసం ప్రాథమిక పనులు జరుగుతున్నాయని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈవో రవీంద్రరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 15 రోజుల్లో డ్రోన్ సర్వే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
2050 వరకు తాగునీటి కొరత లేకుండా
వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఏలేశ్వరం నుంచి విశాఖకు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా రోజుకు 300 క్యూసెక్కుల నీటిని విశాఖకు తరలిస్తారు. తొలుత పోలవరం నుంచి ఈ పైప్‌లైన్ నిర్మించాలని భావించినా ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి విశాఖకు 180 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఏలేశ్వరం నుంచి చేపట్టడం ద్వారా 50 కిలోమీటర్లు తగ్గడంతో నిర్మాణ వ్యయం రూ.1,000 కోట్లు తగ్గుతుందని లెక్కించారు. కాలువల ద్వారా నీటిని తరలిస్తే ఆవిరైపోవడం, ఆ నీటిని ఇతర అవసరాలకు కూడా వినియోగించే అవకాశం ఉండటంతో కేవలం తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది.
ఏలేశ్వరం–విశాఖ నీళ్ల పైప్‌లైన్‌కు డ్రోన్ సర్వే
Published Fri, Jul 30 2021 2:47 AM | Last Updated on Fri, Jul 30 2021 2:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment