సాక్షి, అమరావతి : ఎవరిపైనైనా అసభ్యకర పదజాలంతో, దూషణలతో లేదా కించపరిచే చిత్రాలు, మీమ్స్, ఇతర విధాలుగా సోషల్ మీడియాలో పోస్టు పెడితే అడ్డంగా బుక్కయినట్టే. సొంత ఐడీ అయినా, ఫేక్ ఐడీ అయినా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాష్ట్ర సీఐడీ ఇట్టే పట్టేస్తుంది. ఇందుకు తగ్గ అధునాతన పరిజ్ఞానాన్ని ఇప్పటికే సీఐడీ అంది పుచ్చుకుంది.
దాని ఆధారంగా సోషల్ మీడియా వేధింపులకు కళ్లెం వేసేందుకు పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు ప్రత్యర్థులను దూషిస్తూ, వేధిస్తూ పోస్టులు పెట్టే అవకాశాలున్నందున వీటిపై గట్టి నిఘా పెట్టింది.
ఈ పోస్టులు పెట్టే వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం నిత్యం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను వడపోసి, అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలను వేగవంతం చేయనుంది.
100 మందికి పైగా నిపుణులు
సీఐడీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అందులో సోషల్ మీడియా, ఆన్‌లైన్, సైబర్ వ్యవహారాలపై నైపుణ్యం ఉన్న ఇన్‌స్పెక్టర్లు, ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ఈ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడీ విభాగంలో మరో 25 మంది నిపుణులైన అధికారులను నియమించనున్నారు. దాంతోపాటు జిల్లాల్లో పని చేస్తున్న 75 మంది నిపుణులైన పోలీసు అధికారులు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. దీంతో 100 మందికిపైగా నిపుణులతో పటిష్ట విభాగం అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు మౌలిక వసతులు, ఇతర అంశాలతో కూడిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
నిరంతర నిఘా..
సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా నిత్యం వివిధ సోషల్ మీడియా ఖాతాలను సీఐడీ పరిశీలిస్తోంది. అన్ని రకాల సోషల్ మీడియా పోస్టులను రోజూ కాచి వడపోస్తోంది. అసభ్యకర, వేధింపులకు పాల్పడే, వైషమ్యాలు రెచ్చగొట్టే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను గుర్తించి, వాటిని పెట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అందుకోసం సోషల్ మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచి్చంది.
అసభ్యకర పోస్టులను వెంటనే తొలగిస్తోంది. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తోంది. విదేశాల నుంచి అసభ్యకర పోస్టులు పెడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నవారిని కూడా ఉపేక్షించడంలేదు. వారిపైనా చర్యల కోసం సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వేగంగా దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తోంది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు తెరుస్తోంది.
న్యాయస్థానాల ద్వారా తగిన శిక్షలు పడేలా పటిష్టంగా, వేగంగా దర్యాప్తు చేస్తోంది. పదే పదే కుట్రపూరితంగా సోషల్ మీడియా వేధింపులకు పాల్పడే వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు కూడా నిర్ణయించింది. ప్రధానంగా ఏడాది నుంచి సీఐడీ దూకుడు బాగా పెంచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో సోషల్ మీడియాలో అస భ్యకర పోస్టులపై సీఐడీ కఠిన చర్యలు చేపట్టింది.
ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి...
♦ 2022లో తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 1,450
♦ 2023లో ఇప్పటివరకు తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 2,170
♦నిత్యం పరిశీలిస్తున్న సందేహాస్పద సోషల్ మీడియా ఖాతాలు: 2000
♦ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని గుర్తించిన సోషల్ మీడియా ఖాతాలు: 405
♦ ఇప్పటివరకు తెరిచిన సైబర్ బుల్లీయింగ్ షీట్లు: 2,995
♦ విదేశాల నుంచి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం ఆయా దేశాలతో సంప్రదించిన కేసులు: 45
♦ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు: 5
Comments
Please login to add a commentAdd a comment