సాక్షి, అమరావతి: ‘ఒక జట్టు విజయం సాధించాలంటే హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఎంత ముఖ్యమో.. జట్టును నిలకడగా ముందుకు నడిపించడానికి డిఫెన్స్ బ్యాట్స్‌మెన్ కూడా అంతే ముఖ్యం. ఇందులో కరోనా వ్యాక్సిన్ హిట్ బ్యాట్స్‌మెన్ అయితే.. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డిఫెన్స్ ఆడటంలాంటిది. కోవిడ్ మహమ్మారిని జయించాలంటే ఈ రెండింటి పాత్ర చాలా కీలకం’.. అని అంటున్నారు ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజి మాజీ విభాగాధిపతి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గౌరవ సలహాదారు.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కె. శ్రీనాథరెడ్డి. దేశంలో సెకండ్ వేవ్ వచ్చిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే తప్ప దీని నుంచి బయటపడలేమని హెచ్చరిస్తున్నారు. ‘సాక్షి’తో ఆదివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
జాగ్రత్తే అసలు సిసలు మందు
దేశంలో సెకండ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం ప్రజల అజాగ్రత్తే. కొద్దిగా కరోనా తగ్గింది అనగానే మళ్లీ గుంపులు గుంపులుగా వెళ్లడం, మాస్కులు తీసేసి తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం చేస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ కంటే మంచి మందు ఏదైనా ఉందీ అంటే అది జాగ్రత్తగా ఉండటమే. కొన్ని నెలలపాటు అవి విధిగా పాటించాల్సిందే.
దేశంలోకి మూడు కొత్త స్ట్రెయిన్స్
తాజాగా.. ఐసీఎంఆర్ ఇచ్చిన సమాచారం మేరకు దేశంలోకి మూడు కొత్త రకాల స్ట్రెయిన్స్ వచ్చాయి. అయితే, వాటి పరివర్తన, లక్షణాలు, దాన్ని నిరోధించాల్సిన విధానం ఇంకా తెలీదు. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
టీకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
టీకా ప్రభావం బాగానే ఉంటుంది. టీకా అనేది కరోనా మనకు సోకకుండా కాపాడలేదు. కరోనా సోకిన తర్వాత వచ్చే వ్యాధులను నిరోధించేడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటే మనకు కరోనా రాదు అని అనుకుంటున్నారు. కానీ, అది తప్పు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి జబ్బు తీవ్రతను తగ్గిస్తుంది.
శాశ్వత టీకాకు సమయం పడుతుంది
కరోనా సోకకుండా ఉండే వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో నిర్దిష్టంగా చెప్పలేం. శాశ్వత టీకా వచ్చేవరకూ ఇమ్యూనిటీ వ్యాక్సిన్‌లు కీలకంగా ఉండచ్చు.
పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి దారుణం
బ్రిటన్, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా అజాగ్రత్తలే కొంప ముంచాయి. కొద్దిగా తగ్గగానే బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసేశారు. బిజినెస్ పెంచుకునేందుకు డిస్కౌంట్‌లు ప్రవేశపెట్టారు. దీంతో ఎక్కడికక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడడంతో కరోనా విస్తృతంగా వ్యాపించింది. ఎంతలా అంటే.. ఇప్పుడక్కడ కరోనా బాధితులకు వైద్య సదుపాయం లేకుండాపోయిన పరిస్థితి ఏర్పడింది.
అందరూ టీకా వేయించుకోండి
ప్రస్తుత పరిస్థితుల్లో టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కూడా జాగ్రత్తగా ఉంటే కరోనా ఏమీ చేయలేదు. ఎక్కడికెళ్లినా మాస్కు విధిగా ధరించండి. జన సమూహంలో అస్సలు ఉండొద్దు. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. ఇంతకుమించిన మందు కరోనాకు లేదు.
అజాగ్రత్తల వల్లే సెకండ్‌వేవ్
Published Mon, Mar 22 2021 3:18 AM | Last Updated on Mon, Mar 22 2021 10:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment