పిఠాపురం: కరోనా మహమ్మారి ప్రజల్లో కల్లోలం రేపుతోంది. ఆరు నెలలుగా అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ వైరస్ మానవ సంబంధాలను కూడా నాశనం చేస్తోంది. ఎక్కడైనా ఎవరైనా కరోనాతో మృతి చెందితే ఆ వ్యక్తి అంతిమ సంస్కారాలకు అయినవారు కూడా ముఖం చాటేయాల్సిన దుస్థితి దాపురించింది. తాజాగా పిఠాపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందుకు దర్పణం పడుతోంది.
పట్టణంలోని మేకా వారి వీధిలో నివాసముంటున్న 50 ఏళ్ల వ్యక్తి పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య సిబ్బంది వచ్చి కరోనా మందుల కిట్ ఇచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఆయన భయాందోళనలకు గురై సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.
మృతదేహానికి అంతిమ సంస్కారం చేసే వారు ఎవరు ముందుకు రాకపోవడంతో అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయింది. స్థానికుల సహకారంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఇంట్లో శ వం... వీధిలో భార్య ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు స్థానికుల సహకారంతో ప్రైవేట్ వ్యక్తులకు రూ.15 వేలు ఇవ్వడానికి ఒప్పదం కుదుర్చుకోవడంతో వారు వచ్చి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఆ సొమ్ము మున్సిపల్ అధికారులు ఇస్తారని ఆశించినా అనాథ శవం అయితే తప్ప తాము ఏమీ ఇవ్వలేమని చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment