సాక్షి, తూర్పుగోదావరి: టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ. పది లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన స్వగ్రామం మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి తన వంతు సహాయంగా రూ. ఐదు లక్షలను అందజేశారు. దీనిలో భాగంగా తన గ్రామంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. వెయ్యి చొప్పున తన కుటుంబ సభ్యుల ద్వారా పంపిణీ చేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తను పుట్టిన గ్రామ ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుకుమార్ తెలిపారు. ‘మిత్రులకే కాదు, శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రావొద్దని కోరుకుంటున్నాను. తన గ్రామంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. తనని చూసి మరికొందరు ముందుకు వస్తారని, కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెబుతున్నాను’ అని సుకుమార్ పేర్కొన్నారు.
కాగా ఈ ఆపత్కాలంలో తమ కష్టాలను గమనించి చేయూతనిచ్చిన సుకుమార్ గారికి రుణపడి ఉంటామని గ్రామస్తులు ఆయన సేవలను ప్రశంసించారు. ఆపదలో వున్న సమయంలో ఇలా తన సొంత ఊరు కోసం సహాయం చేసిన సుకుమార్‌ను మలికిపురం ఎస్సై నాగరాజు ప్రశంసించారు. కాగా, తన సొంత ఊరుకు సుకుమార్ సాయం చేయడం పట్ల నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొంటున్నారు. ‘సుకుమార్ సర్ మీకు సెల్యూట్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (ప్రభాస్, బన్నీ మళ్లీ ఇచ్చారు!)
Comments
Please login to add a commentAdd a comment