సాక్షి, అమరావతి: విదేశీ ప్రయాణ అనుమతి పత్రాల(పాస్‌పోర్ట్స్)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ బాగా తగ్గింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర కాలంగా పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. విదేశాల్లో ఉద్యోగావకాశాలు మందగించడంతో వివిధ దేశాలకు వెళ్లేవారు తగ్గిపోయారు. ఫలితంగా కొత్తగా పాస్‌పోర్ట్‌లు తీసుకునేవారి సంఖ్య సగానికి పడిపోయింది. గతంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం విడుదల చేసే స్లాట్‌లు సరిపోయేవి కాదు. ఇప్పుడు మాత్రం 50 శాతం స్లాట్‌లు మాత్రమే పూర్తవుతున్నాయి. ఈ స్లాట్స్‌కు హాజరవుతున్న వారిలోనూ అత్యధికులు విద్యార్థులే కావడం గమనార్హం.
రోజుకు 1,500 మందే..
రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రాలతోపాటు వాటి పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో కలిపి రోజుకు 2,700కి పైగా స్లాట్‌లు ఇచ్చినా దరఖాస్తుదారులకు సరిపోయేవి కాదు. ప్రస్తుతం అదే స్థాయిలో స్లాట్‌లు అందుబాటులో ఉన్నా రోజుకు 1,500 మందికి మించి పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడం లేదు. వారిలోనూ 60 శాతం వరకు విద్యార్థులే ఉంటున్నారు. జీఆర్‌ఈ, టోఫెల్ వంటి పరీక్షలు రాయాలంటే విధిగా పాస్‌పోర్ట్ నంబర్ ఉండాలి. ఈ కారణంగానే ఆ మాత్రం దరఖాస్తులైనా వస్తున్నాయి. వీళ్లే కాకుండా కోవిడ్‌కు ముందు రాష్ట్రానికి వచ్చి.. పాస్‌పోర్ట్ కాల పరిమితి ముగిసిన వారు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. గతంతో పోలిస్తే పాస్‌పోర్ట్ దరఖాస్తుకు నిబంధనలు బాగా సడలించినా కోవిడ్ కారణంగా దరఖాస్తుదారులు రావడం లేదు.
మారిన ట్రెండ్‌లోనూ..
గతంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు మాత్రమే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడా ట్రెండ్ మారింది. కొందరు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. పట్టణాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఇలా నెలల చిన్నారులకు సైతం దరఖాస్తు చేస్తున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వారు కూడా పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడం బాగా తగ్గింది. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గి, అంతర్జాతీయ ప్రయాణాలు మళ్లీ యథావిధిగా కొనసాగితే పాస్‌పోర్ట్‌లకు డిమాండ్ పెరుగుతుందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.
కారణం చూపిస్తే స్లాట్ కంటే ముందే..
అత్యవసర పరిస్థితి ఉందీ అంటే ముందస్తుగా కూడా పాస్‌పోర్ట్ జారీ చేస్తాం. అయితే దానికి తగ్గ కారణాలు చూపించాలి. సరైన కారణాలు చూపిస్తే స్లాట్‌ను ముందుకు జరుపుతాం. దీనివల్ల దరఖాస్తుదారుడికి అనుకున్న సమయానికి పాస్‌పోర్ట్ వస్తుంది. ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా సులభమైంది.
– డీఎస్‌ఎస్ శ్రీనివాసరావ్, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment