
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రజలు ఇందులో ప్రయాణించేందుకు అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారని రైల్వే అధికారులు చెప్పారు.
జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. దీని వేళలు విజయవాడ పరిసర ప్రజలకు అనుకూలంగా మారాయి. దీంతో విజయవాడ కేంద్రంగా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి.
నెల రోజుల్లో విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌కు 8,613 మంది.. రాజమండ్రి, విశాఖకు మరో 9,883 మంది ప్రయాణించారు. విశాఖ వైపు నుంచి 9,742 మంది, సికింద్రాబాద్ వైపు నుంచి 10,970 మంది విజయవాడకు వచ్చారు. మొత్తంగా విజయవాడ స్టేషన్‌కు సంబంధించి రోజుకు సగటున 1,352 మంది రాకపోకలు సాగిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న సౌకర్యాలు..
వందే భారత్‌లోని ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వేగం, ఏసీతో పాటు ప్రతి కోచ్‌లో రిక్లైనర్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు, ఎమర్జెన్సీ అలారం బటన్లు, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లున్నాయి. సురక్షిత ప్రయాణం కోసం అన్ని కోచ్‌ల లోపలా, బయట సీసీటీవీ కెమెరాలు, మెరుగైన అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేశారు. ఆధునిక బయో వాక్యూమ్ టాయిలెట్లు కూడా ఉన్నాయి.
ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ప్రతి కోచ్‌లో పెద్ద డిస్‌ప్లే యూనిట్లను ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా ‘కవచ్’ పరిజ్ఞానాన్ని కల్పించారు.
140 శాతం ఆక్యుపెన్సీ సంతృప్తికరం..
వందే భారత్ రైలు విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య రెండు వైపులా పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. ఇరువైపులా దాదాపు 140 శాతం సగటు ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. వేగంతో పాటు ఆధునిక సౌకర్యాలుండటంతో విజయవాడ, సమీప ప్రాంతాల ప్రయాణికులు ఇందులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు.
– అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment