జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి నివాళి అర్పించిన మంత్రి దాడిశెట్టి రాజా. చిత్రంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రాజకీయ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయంగా ఎదిగానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గం తుని వెళ్తున్న ఆయనకు వేమగిరి నుంచి కంబాలచెరువు సెంటర్ వరకూ భారీగా మోటా ర్ సైకిళ్లు, కార్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి తొలుత బొమ్మూరులోని ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శ్రీనివాసులురెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఇటీవల మృతి చెందిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి చిత్రపటానికి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఐఎల్‌టీడీ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ మంత్రి దాడిశెట్టి రాజాను రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేతల సహకారంతో ముందుకు
తర్వాత స్టేడియం రోడ్డు మీదుగా ర్యాలీ తాడితోట, కంబాల చెరువు సెంటర్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ మంత్రిగా రామ్మోహనరావు విశేష సేవలందించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంపీ వంగా గీత, సోదరులు జక్కంపూడి రాజా, గణేష్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కాకినాడ ఎంపీ వంగా గీత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మానే దొరబాబు, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్, అడపా అనిల్, ముద్దాల అను, కోడికోట, ఆరిఫ్, జేకే అరుణ్, కేఆర్‌జే రాజేష్, గన్నవరపు సంజయ్, కనకాల రాజా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ర్యాలీకి వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment