వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద పెన్నానదిలో నీటి ప్రవాహం
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల ప్రభావంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
► గుంటూరు జిల్లాలో పోటేళ్లవాగు, ఓగేరు, పెరమవాగు, మొద్దువాగులు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. దీంతో సచివాలయంతోపాటు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో అత్యధికంగా 151 మి.మీ. వర్షపాతం నమోదైంది.
► ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకున్న ఇద్దరిని గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. పెంచికలపాడు వాగులో చిక్కుకున్న అంకయ్య అనే వ్యక్తిని కాపాడారు. కొత్తకోట వాగు ఉధృతిలో చిక్కుకున్న హరియాణకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌లను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. తూర్పు వాగులో చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు శ్రావణ్‌కుమార్ (11), గుంజి విశాల్ అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. గాలించి ఇరువురిని వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రావణ్ మృతిచెందాడు. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 186.2 మి.మీ. వర్షం కురిసింది.
► వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజులోనే 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ముద్దనూరు చెరువు కట్ట తెగింది. కలసపాడు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు.
► అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఒకే రోజు 23 మి.మీ. వర్షపాత సగటు నమోదైంది. వందలాది చెరువుల్లోకి పెద్దఎత్తున వర్షపునీరు చేరింది.
► చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట వద్ద మద్దెలవంకలో సుమంత్ (14) అనే విద్యార్థి వాగులో కొట్టుకుపోయాడు. తనతో పాటు వాగులో జారిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సుమంత్ ఆచూకీ తెలియరాలేదు.
► కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ పరిధి పెద్దకొట్టాల సమీపంలోని నంది ఫారŠుచ్యనర్ వెంచర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో తొమ్మిది కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వెంచర్ ప్రహరీని పగలగొట్టించి వరదనీరు బయటకు వెళ్లేలా చేశారు.
ఆర్టీపీపీ యూనిట్లలోకి నీరు
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో శనివారం భారీ వర్షం కురవడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) యూనిట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మోటార్లు, యంత్ర సామాగ్రి మునిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీటి పంపింగ్ చేపట్టారు. ఆర్టీపీపీ సీఈ ఎల్ మోహన్‌రావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతంలో నీరు చేరిందని, ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు.
నేడు, రేపు కోస్తాకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు బిహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ 3.1కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.