ఆ కోణంలో దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌ | Delhi Aiims Doctors Said Drinking Water Was Safe In Eluru | Sakshi
Sakshi News home page

ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదు..

Published Fri, Dec 11 2020 5:17 PM | Last Updated on Fri, Dec 11 2020 8:22 PM

Delhi Aiims Doctors Said Drinking Water Was Safe In Eluru - Sakshi

సాక్షి, అమరావతి: ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏలూరులో పరిస్థితులకు సంబంధించి ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. గత రాత్రి నుంచి ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో 8 మంది, ఏలూరులో 5గురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు అంతా డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారు తిరిగి ఆస్పత్రులకు వచ్చిన దాఖలాలు లేవు. పశువుల నుంచి కూడా కొన్ని శాంపిళ్లు తీసుకుని భోపాల్‌కు పంపాం. అలాగే చేపల శాంపిళ్లు కూడా తీసుకున్నాం. గాలిలో కాలుష్యంపైనా కూడా పరీక్షలు చేయించాం. అన్ని ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.(చదవండి: రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి: సీఎం జగన్‌)

శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్స్‌ లేవు: ఎయిమ్స్‌ వైద్య బృందం 
16 శాంపిల్స్‌ను పరిశీలించామని, తాగునీటి శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్స్‌ లేవు, మరోసారి పరీక్షలు చేస్తున్నామని న్యూఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య బృందం వివరించింది. ప్రాథమికంగా పాలలో నికెల్‌ కనిపించింది, దీనిపై మరింత పరిశీలన చేస్తున్నాం. కానీ బ్లడ్‌ శాంపిళ్లలో లెడ్, నికెల్‌లు కనిపించాయి. యూరిన్‌లో లెడ్‌ కనిపించింది. పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి దారి తీయొచ్చు. ఎందుకంటే పురుగు మందుల్లో భారీ లోహాలు ఉంటాయి. ఆర్గనో క్లోరిన్‌ ఉందా? లేదా? అని చెప్పడానికి సీఐఎస్‌ఎఫ్‌ఎల్‌కు పంపాం. ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు. (చదవండి: అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు)

తాగునీరు సురక్షితం: ఇండియన్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ
21 తాగు నీటి శాంపిళ్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించామని ఇండియన్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ పేర్కొంది. తాగు నీరు క్లీన్‌ అని స్పష్టంగా చెప్తున్నాం. తాగు నీటి శాంపిళ్లలో లెడ్‌ కాని, ఆర్గనో క్లోరిన్‌ కాని, ఆర్గనో ఫాస్పేట్స్‌ కాని కనిపించ లేదు. బ్లడ్‌లో లెడ్, ఆర్గనో క్లోరైడ్స్‌ ఉన్నాయి. సిరమ్‌ శాంపిళ్లలో ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్‌ కనిపించాయి. ఆర్గనో క్లోరిన్స్, ఆర్గనో ఫాస్పరస్‌ రెండింటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నామని వివరించారు.

పురుగు మందుల అవశేషాలే కారణం:ఎన్‌ఐఎన్‌
ఎన్‌ఐఎన్‌లో 9 మందితో కమిటీని ఏర్పాటు చేశాం. పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమిక అంచనా వేశాం. దీర్ఘకాలంలో పరిశోధన చేయాల్సి ఉంది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.  బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు అధికంగా కనిపించాయి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. టమోటాపైన కూడా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గనో పాస్ఫరస్‌ బ్లడ్‌లో కనిపించింది. ఎలా ఇవి మనుషుల శరీరంలోకి ప్రవేశించిందన్నదానిపై గుర్తించాల్సి ఉందని ఎన్‌ఐఎన్ బృందం వెల్లడించారు.

ఆ అనవాళ్లు కనిపించలేదు..
భూగర్భ జలాన్ని పరిశీలిస్తున్నామని ఎన్‌ఈఈఆర్‌ఐ (నీరి) బృందం పేర్కొంది. శాంపిళ్లు తీసుకున్నాం. పరీక్షల ఫలితాలు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 100కి పైగా  శాంపిళ్లు తాగునీటిని చెక్‌ చేస్తే భారీలోహాలు కాని, ఆర్గనో క్లోరిన్స్‌గాని, ఆర్గనో ఫాస్పరస్స్‌ ఆనవాళ్లు కనిపించలేదని  ఏపీ మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

కచ్చితంగా కనిపెట్టాలి..
తాగునీటి మీద ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించాలని.. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఒకటికి రెండు సార్లు ఖరారు చేసుకోవాలన్నారు. బ్లడ్‌ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్‌ కనిపిస్తోంది.. ఎలా వచ్చిందన్నది కచ్చితంగా కనిపెట్టాలని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఇది ఎలా జరిగిందన్న దానిపై కచ్చితంగా కనిపెట్టాలని.. ఈ కోణంలో అందరూ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

సీఎం వైఎస్‌ జగన్ ఇంకా‌ ఏమన్నారంటే..
‘‘ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కమిటీని వేశాం. ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ ముందడుగు వేయాలి. బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షిద్దాం. విచ్చలవిడిగా పురుగు మందులు, అలాగే నిషేధిత పురుగు మందుల వినియోగాన్ని అడ్డుకోవాలి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిషేధించిన పురుగు మందులు అమ్మితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా అనుమతించిన పురుగు మందులు, ఎరువులు మాత్రమే రైతులకు చేరవేయాలి. వాటి వినియోగంపైన రైతులకు అవగాహన కల్పించాలి. తద్వారా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అడ్డుకోగలుగుతాం. ప్రస్తుతం వినియోగిస్తున్న పురుగుల మందులను పరీక్షలు చేయాలి. వచ్చే నెలరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగాలి.

ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా? కాదా? అన్నదానిపై ముందు పూర్తి స్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ మీద దృష్టిపెట్టాలి. దానిపై అవగాహన కల్పించాలి. సేంద్రీయ పద్దతుల ద్వారా ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిల్స్‌ కూడా తీసుకుని పరీక్షలు చేయించండి. పెస్టిసైడ్స్‌ రూపంలో కూడా చేరే అవకాశాలున్నాయని చెప్తున్నారు కాబట్టి పరిశీలన చేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. కాగా, 19 నీటి శాంపిళ్లను పరిశీలించిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటవ్‌ మెడిసిన్, వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. భార లోహాలు కనిపించలేదని వెల్లడించింది. ఈకోలి సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. మరో వైపు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వాతావరణంలో వాయువులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని గుర్తించారు. పురుగు మందుల అవశేషాలపై ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు.

ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, ఎయిమ్స్‌ మంగళగిరి, సీసీఎంబీ, నీరి–హైదరాబాద్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ఎన్‌ఐవీ పూణె, ఎన్‌సీడీసీ సభ్యులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో   డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. క్యాంప్‌ ఆఫీసు నుంచి కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement