అంబాజీపేట మార్కెట్‌కు రోజుకు 500కు పైగా కాయలు
జిల్లా నుంచి హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు ఎగుమతి
ఈ ఏడాది రికార్డుస్థాయిలో దిగుబడి
సీజన్‌లో రూ.ఏడు కోట్ల వ్యాపారం
ఏడాది పొడవునా పనస పొట్టు
సాక్షి అమలాపురం: చూడగానే నోరూరించే పనస పంటకు కోనసీమ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తేనెలూరే రుచి ఉండే ఈ పనస తొనలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి, అరటి తరువాత కోనసీమలో పండే విలువైన పంటల్లో పనస ఒకటి. ఈ కారణంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో పండే పనసకన్నా కోనసీమలో పండే పనసకు మంచి డిమాండ్ ఉంది.
79.36 ఎకరాల్లో సాగు
వేసవి వచ్చి0దంటే చాలు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనస కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు గోదావరి లంక గ్రామాల్లో కొబ్బరి తోటల్లో పనస చెట్లను పెంచడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుంది.
ఇక్కడ కొబ్బరి తోటల్లో మధ్యన, గట్ల మీద, సరిహద్దుల్లో పనసను రైతులు పెంచుతుంటారు. పనస మీద వచ్చే ఆదాయానికి తోడు ఏళ్ల పాటు చెట్టును పెంచితే టేకు, మద్ది కర్రతో సమానంగా ఆదాయం వస్తున్నది. దీని వల్ల డెల్టా, గోదావరి లంకల్లో పనస చెట్లు గణనీయంగా ఉంటాయి. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 79.36 ఎకరాల్లో పనస సాగు జరుగుతున్నది.
కానీ వాస్తవంగా కొబ్బరి తోటలు, రోడ్లు, పంట కాలువల వెంబడి చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందుకు రెండుమూడు రెట్లు సాగు జరుగుతున్నదని అంచనా. ఏజెన్సీతో పోల్చుకుంటే డెల్టా, గోదావరి లంకల్లో పెరిగే పనస తొనల రుచి అధికం. అందుకే జిల్లా నుంచి వచ్చే పనసను కోనసీమ పనసగా చెప్పి ఇతర పట్టణాల్లో అమ్ముతుంటారు.
సీజన్‌లో రూ.ఐదు కోట్ల ఎగుమతులు
వేసవి సీజన్‌లో జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పనస కాయలు రవాణా అవుతుంటాయి. కొబ్బరి తరహాలోనే పనసకు సైతం అంబాజీపేట అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్. రోజుకు 500కు పైగా పనస కాయలు వస్తాయని అంచనా.
కాగా, జిల్లా నుంచి రోజుకు 800 నుంచి వేయి కాయల వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పనస ఎగుమతి అవుతున్నది. మార్చి నుంచి జూలై నెల వరకు ఒక్క అంబాజీపేట నుంచే రూ.5 కోట్ల విలువైన పనస ఎగుమతి అవుతున్నదని అంచనా. మొత్తం జిల్లావ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తున్నది.
దిగుబడి పెరిగి.. ధర తగ్గింది..
గత నాలుగైదు ఏళ్ల కన్నా ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది. చెట్టుకు సగటున 10 నుంచి 15 కాయల వరకు వస్తుంటాయి. ఈసారి 25 కాయలకు పైబడి దిగుబడిగా వస్తోంది. దీనివల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాయ సైజు, బరువును బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు ధర ఉంటున్నది.
ఏడాది పొడవునా పనస పొట్టు
కూరల్లో వినియోగించే పనస పొట్టు ఏడాది పొడవునా కోనసీమలో దొరుకుతున్నది. ఇది కూడా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నది. కేజీ పనస పొట్టు ధర రూ.175 నుంచి రూ.200 వరకు ఉంది. ఇది డిసెంబర్ నుంచి జూలై వరకు స్థానికంగా లభ్యమవుతున్నది.
పెరిగిన ఎగుమతులు
గతంలో కన్నా గత ఐదేళ్లుగా అంబాజీపేట మార్కెట్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలికి పనస కాయల ఎగుమతి జరుగుతున్నది. ఈ ఏడాది కాయల దిగుబడి అధికంగా ఉంది. అయితే ఎగుమతులు పెరగడం వల్ల సరుకు నిల్వ ఉండడం లేదు. మా దుకాణాల వద్ద రిటైల్ అమ్మకాలు కూడా పెరిగాయి. – కుంపట్ల నాగేశ్వరరావు, వ్యాపారి, అంబాజీపేట
Comments
Please login to add a commentAdd a comment