డ్రోన్ షోకి అడ్డొస్తుందని అప్‌కాస్ట్ ప్రహరీ కూల్చివేత
రూ.40 లక్షలకుపైగా నిధులు వృథా
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వం నిర్వహించనున్న ‘షో’కి అడ్డం వస్తుందని ప్రజాధనంతో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చేశారు. విజయవాడలో కృష్ణానది తీరాన పున్నమిఘాట్‌లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ షో, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు అడ్డువస్తుందని అప్‌కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని కూల్చేశారు. భవానీపురం కరకట్ట సౌత్ రోడ్‌లోని పున్నమిఘాట్‌కు ఆనుకుని ఆక్రమణకు గురైన ఎకరానికిపైగా స్థలాన్ని అప్‌కాస్ట్ గత మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణ సర్వే చేయించి స్వా«దీనం చేసుకున్నారు.
సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చుపెట్టి ఈ స్థలానికి ప్రహరీ నిర్మించారు. అప్‌కాస్ట్ సరిహద్దుకు వెనుక (పున్నమిఘాట్ లోపల) ఉన్న ప్రైవేట్ వ్యక్తులు తమ స్థలానికి దారిలేకుండా ప్రహరీ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పున్నమిఘాట్‌లో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయించింది.
దీనికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఈ కార్యక్రమానికి అడ్డువస్తుందని అప్‌కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని గురువారం రాత్రి జేసీబీతో కూల్చేశారు. కూల్చేసిన శిథిలాలను తిరిగి సైన్స్ సెంటర్ ఆవరణలోనే పడేశారు. గోడ కూలుస్తున్నామని అప్‌కాస్ట్ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. దీనిపై అప్‌కాస్ట్ ఏవో పద్మను అడగగా.. తాను మాట్లాడతానని అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ అనంతరాము చెప్పినట్లు తెలిపారు.
గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పున్నమిఘాట్ పరాదీనం
గత కృష్ణా పుష్కరాల సమయంలో (2016) అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్ ఫ్రంట్ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి నిర్మించిన పున్నమిఘాట్‌లో సింహభాగం పరా«దీనం అయింది. పున్నమిఘాట్ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు మేరకు పున్నమిఘాట్‌లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాదీనం చేశారు.
తరువాత స్థల యజమానులు ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్ షోకి ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్) సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉంటే ఈ రోజు డ్రోన్ షో నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment