సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడమే కాదు.. వారి ఇళ్లకే వెళ్లి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పలకరించనున్నారు. పోషణ్ అభియాన్ 2.0 స్కీమ్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరగడం (విజిట్) లేదని పేర్కొంది. ఇకపై రోజుకు నాలుగు ఇళ్లకు తిరిగి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని కేంద్రం అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల యోగక్షేమాలు చూడడంతోపాటు వారి ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారి ఇళ్లకే వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకోవడం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు ఎవరైనా రాకపోయినా, వారికి ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి రోజు కనీసం ఒక గర్భిణి, ఓ బాలింత, రెండేళ్లలోపు వయసు గల ఇద్దరు పిల్లల ఇళ్లకు విజిట్‌కు వెళ్లాలి. రోజుకు నాలుగు ఇళ్ల చొప్పున నెలలో 25 రోజులపాటు వంద విజిట్లు పూర్తి చేయాలి. కనీసం 60 శాతం అయినా వాటిని పూర్తి చేయాలనే నిబంధన విధించారు. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లు ఇవ్వకూడదని కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది. ఈ హోం విజిట్‌కు సంబంధించిన అంశాలను ఐసీడీఎస్‌ల పరిధిలోని అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనితోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇటీవల చేపట్టిన ‘గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్’నూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఇంటికెళ్లి పలకరించండి
Published Thu, Jul 7 2022 3:56 AM | Last Updated on Thu, Jul 7 2022 2:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment