సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన మీద ప్రతిపక్షనేత చంద్రబాబు తప్పుడు లేఖ రాశారు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బి కొత్తకోటలో జరిగిన గొడవలో ఇరు వర్గాలు టీడీపీకి చెందిన వాళ్లేనని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అబద్దాలతో లేఖ రాశారని వెల్లడించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు తెలిశాయని చెప్పారు. ఇలా తప్పుడు లేఖలు మరోసారి రాయకుండా ఉండేలా ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టాలి అని నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచి విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. ఎస్వీయూ ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్దిరెడ్డి వ్యతిరేకంగా పని చేశారని, అప్పటి నుంచి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు కోపమని పేర్కొన్నారు. ఇప్పుడు కులం పేరుతో తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారని నారాయణ స్వామి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment