సాక్షి, అమరావతి: గిరిజన విద్యాసంస్థల్లో చదువుకొనే పిల్లల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్న దొర హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యార్థుల సంరక్షణకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాజన్నదొర పలు అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించడానికి గతంలో ఉన్న ఏఎన్ఎంల సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 590 మంది ఏఎన్ఎంలను నియమించడంతో పాటుగా ఆయా పాఠశాలల పరిధిలోని సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంతో గిరిజన విద్యార్థులను ముందుగా మ్యాపింగ్ చేయించాలని సూచించారు.
పాఠశాలలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించాలని చెప్పారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లోని అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులను ఆస్పత్రులకు చేరవేసి అవసరమైన చికిత్సలను చేయించాలన్నారు. ఈ విషయంలో ఏ అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాజన్న దొర స్పష్టం చేసారు.
గిరిజన విద్యా సంస్థల్లో భద్రతను పెంచడంలో భాగంగా ఇదివరకే ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన అన్ని చోట్లా కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేలా డీటీడబ్ల్యుఓలు, డీడీలు, ఇతర అధికారులు పాఠశాలల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
చింతపల్లిలోని ఎస్టీ డిగ్రీ కళాశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని, సీతంపేటలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని అధఇకారులను కోరారు. మాతృభాషా వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వేతనాలను సక్రమంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జీసీసీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న దొర అధికారులను ఆదేశించారు. కాఫీ రైతులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన చెల్లించడానికి, కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జీజీసీ అధికారులను కోరారు.
గిరిజన సంక్షేమశాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 1633 మంది టీచర్లు, జూనియర్ లెక్చరర్ల వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఆర్టీ టీచర్లు తమకు 12 నెలల వేతనాలు ఇవ్వాలంటూ కోరుతున్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షిస్తూ, సబ్ ప్లాన్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో అవసరమైన రహదారుల నిర్మాణానికి చర్యలను చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను రాజన్న దొర ఆదేశించారు. గిరిజన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేష్ కుమార్, ఇఎన్సీ శ్రీనివాసులు, ట్రిప్ కో ఎండీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment