స్కూల్‌కి పోదాం.. ఛలో! | Andhra Pradesh Government Issued Guidelines For Admission Process In Schools | Sakshi
Sakshi News home page

స్కూల్‌కి పోదాం.. ఛలో!

Published Tue, Sep 15 2020 4:45 AM | Last Updated on Tue, Sep 15 2020 8:31 AM

Andhra Pradesh Government Issued Guidelines For Admission Process In Schools - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా దీర్ఘకాలంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు మళ్లీ స్కూళ్లలో అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి. సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయకుండా విద్యార్థులను చేర్చుకోవడం, పరీక్షల్లేకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేశారు కనక అవసరమైన వారిని ఇతర స్కూళ్లకు పంపటం వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. ఇతర స్కూళ్లలో చేరాలనుకున్నవారికి టీసీలు జారీ చేయడానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఎవ్వరినీ బలవంతంగా ఇతర స్కూళ్లకు పంపకుండా, అదంతా తల్లిదండ్రుల అనుమతితోనే జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. 

ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించకూడదు..
► వచ్చే నెల నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి, పై తరగతులకు ప్రమోట్‌ చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వీటి ప్రకారం... కోవిడ్‌ పరిస్థితులున్నాయి కనక ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించరు. ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దీనిని పూర్తి చేస్తారు.
► 5, 7వ తరగతుల విద్యార్థులు తదుపరి చదువుల కోసం ఇతర పాఠశాలలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించి ప్రవేశాలను చేపట్టాలి. ఈ మేరకు ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారు.
► 5, 7వ తరగతులు చదివిన విద్యార్థులు తదుపరి ఏ స్కూల్లో చదవదల్చుకున్నారో తల్లిదండ్రులతో హెడ్మాస్టర్లు మాట్లాడి నిర్ధారించుకోవాలి. ఆ సమాచారాన్ని పిల్లలు చేరదలచుకున్న పాఠశాలల హెడ్మాస్టర్లకు లిఖితపూర్వకంగా తెలియచేయాలి. తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా స్కూళ్లలో ప్రవేశాలు సజావుగా జరిగేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల విషయంలో ఎంఈవోలు, హైస్కూళ్ల విషయంలో ఉపవిద్యాధికారులు దీన్ని పర్యవేక్షించాలి. 
► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఏ విద్యార్థినీ ఇతర స్కూళ్లలోకి పంపకూడదు. విద్యార్థి ఏ స్కూల్లో చేరదలుచుకున్నా తల్లిదండ్రుల ఆప్షన్‌ను లిఖితపూర్వకంగా తీసుకోవాలి.
► తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నాక విద్యార్థి స్కూల్‌ రికార్డు, టీసీలను విద్యార్థి చేరదలుచుకున్న పాఠశాల హెడ్మాస్టర్‌/ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఇందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకోవాలి.
► స్వస్థలాలకు చేరుకున్న ఉపాధి కూలీల పిల్లలకు ఎలాంటి గుర్తింపు పత్రాలు అడగకుండా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. బదిలీ సర్టిఫికెట్ల (టీసీ) కోసం బలవంతం చేయకుండా... గతంలో చదివిన తరగతి తాలూకు నిర్థారణ పత్రాలు అడగకుండా... తల్లిదండ్రులిచ్చిన సమాచారం సరైనదిగా భావించి సదరు తరగతిలో పిల్లలకు ప్రవేశం కల్పించాలి.
► అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, తుది నిర్ణయం మాత్రం కేంద్రం ప్రకటించే లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తీసుకుంటారు.

రెసిడెన్సియల్, మోడల్‌ స్కూళ్లలో ఇలా...
► రెసిడెన్సియల్‌ స్కూళ్లు, మోడల్‌ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో  ప్రవేశాల ప్రక్రియ ఆన్‌లైన్లో జరుగుతున్నందున వారికి సంబంధించిన ధ్రువపత్రాలు, రికార్డులను సంబంధిత ప్రిన్సిపాళ్లు రసీదులు తీసుకొని అప్పగించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను వారి సామర్థ్యాలను అనుసరించి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. బడి బయటి పిల్లలను హెడ్మాస్టర్లు, టీచర్లు గుర్తించి వారికి కూడా ప్రవేశాలు కల్పించాలి. వీరి విషయంలో ధ్రువపత్రాలు, రికార్డుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేయకుండా తొలుత పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవాలి. 

జాబితాలు సిద్ధం చేయాలి...
► కోవిడ్‌ నేపథ్యంలో స్కూళ్లు మార్చి నుంచే మూతపడడంతో 2019–20 విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించలేదు. అన్ని తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తూ “ఆల్‌ పాస్‌’ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను పై తరగతులకు పదోన్నతి కల్పిస్తూ జాబితాలను సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించనుంది.
► ప్రాథమిక పాఠశాల్లో 1 నుంచి 4వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 6వ తరగతి వరకు, హైస్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి వరకు చదివిన పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement