Varalakshmi Vratham Pooja Vidhanam In Telugu: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి - Sakshi
Sakshi News home page

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి

Published Thu, Aug 19 2021 9:17 PM | Last Updated on Fri, Aug 20 2021 2:03 PM

Detailed Process Varalakshmi Vratham Pooja In telugu - Sakshi

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. ఒకవేళ ఈ రోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన నమ్మకం.

ఈ వ్రతం ఎలా చేసుకోవాంటే
► వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
► ఇంటి గుమ్మాలకు పసుపుకుంకుమలను రాసుకోవాలి.
► ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి.
► లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు. కాబట్టి ఇంటి ఈశాన్యభాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి.
► ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి.
►  ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.. దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను నిలపాలి.
►ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే!
► అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేస్తారు. ఇందుకోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి.
ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ, తోరపూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ...అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి.

అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు
అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపిపదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా ఎలాగూ అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకమ్ తప్పకుండా చదువుతాము. వీటితో పాటుగా కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట.

ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తయిదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. 

కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నింటినూ సాగే వరలక్ష్మీ వ్రతం ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళమూ జరగకుండా కాపాడి తీరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement