
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామాల్లోని రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి రైతులు సంతృప్తి వ్యక్తంచేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన గురువారం మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో కలిసి మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులతో డీఎల్‌ఎన్‌సీ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని, రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో రూ.5 లక్షలు పెంచుతూ రూ.25 లక్షల పరిహారాన్ని అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీనిపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నిర్వాసిత రైతులను మంత్రులు సత్కరించారు.
రైతుల త్యాగాలు మరువలేమని మంత్రులు చెప్పారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో జయరావు, తహసీల్దార్ చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment