ఢిల్లీలో జరిగిన ఏపీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ మీట్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ చేసిన స్పీచ్ కాని, అక్కడ పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాని గమనిస్తే ఏపీకి ఆశాజనక పరిస్థితులు ఏర్పడుతున్నాయనిపిస్తుంది. జగన్ ముఖ్యంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని బాగా పెంచిందని చెప్పవచ్చు. గతంలో ఇలాంటి సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చీరాని ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటే వినేవారికి చాలా ఇబ్బందిగా ఉండేది.
భాష పరిపూర్ణంగా రాకపోవడం తప్పుకాదు. కాని దానికి ప్రత్యామ్నాయంగా ఆయన రిటెన్ స్పీచ్ చదువుతుంటే సరిపోయేది. ఆయన అలా చేయకపోవడమే కాక, సుదీర్ఘంగా మాట్లాడుతుండేవారు. అది పెద్ద,పెద్ద పారిశ్రామికవేత్తలకు విసుగు తెప్పించేదని అంటారు. కాకపోతే మర్యాద కోసం భరించేవారని చెబుతారు. చంద్రబాబు తనకు అన్ని తెలుసునన్నట్లుగా వ్యవహరించేవారు. కాని జగన్ అలా కాకుండా చక్కటి ఆంగ్లంలో అందరిని ఆకట్టుకునేలా మాట్లాడారు. అది ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పారు.
ఏపీలో ఉన్న అపార వనరులు, అవకాశాలు, ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వపరంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి వాటిలో నంబర్ వన్‌గా ఉండడం తదితర అంశాలను ఆయన ప్రస్తావించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాను అందుబాటులో ఉంటానని ఆయన అన్ని చోట్ల చెబుతున్నట్లుగానే ఇక్కడా చెప్పారు. మార్చి మొదటివారంలో విశాఖలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అంతా రావాలని ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీకి కూడా ఆయన కృతజ్ఞత చెప్పడం ద్వారా తన మెచ్యూరిటీని ప్రదర్శించారు. తద్వారా కేంద్రంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న సంకేతం పంపించారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక సంఘాల ప్రముఖులతో పాటు పలువురు దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత రాకూడదన్న దురుద్దేశంతో తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు వంటి పత్రికలు కాని సీఎం ఢిల్లీ టూర్‌ను వక్రీకరించడానికి యత్నించాయి. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం చేశారు.
జగన్ తన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి వెనక్కి వచ్చి, మళ్లీ వెంటనే మరో విమానంలో ఢిల్లీ వెళ్లి, అక్కడ పూర్తి సమయం పారిశ్రామికవేత్తలతో గడిపారు. అదే కనుక ఈ సదస్సుతో పాటు జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్రధాని మోదీని కలిసి ఉంటే, ఇంకేముంది సీబీఐ కేసు గురించే అని విపరీత ప్రచారం చేసేవారు. కాని ఆయన ఎవరిని కలవకుండా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
ఈ సదస్సులో జగన్‌ను ఆయా ప్రముఖులు ప్రశంసించిన తీరును గమనించండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడమే ఏపీకి పెద్ద ఆస్తి అని ఆసోచామ్ అధ్యక్షుడు సుమంత్ సిన్హా వ్యాఖ్యానించారంటేనే ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఏ రకమైన బాటలు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. అదే చంద్రబాబును కనుక ఇలా మెచ్చుకుని ఉంటే టీడీపీ పత్రికలు బానర్ కథనాలు ఇచ్చి ఉండేవి. వ్యాపార విస్తరణలో ఏపీ ఉత్తమంగా ఉందని క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తమ సంస్థ ఇక్కడ విస్తరణ చేస్తుందని కూడా ఆయన తెలిపారు.
తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామని టోరే ఇండస్ట్రీస్ ఎండి ప్రకటించడం కూడా హర్షదాయకం. ఇలా ఒకరు కాదు.. అనేక మంది ప్రముఖులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని జగన్ వివరించారు. ఇలా ఆయా రంగాలకు సంబంధించి విశాఖలో పెట్టుబడుల సద్సులో అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అప్పట్లో టీడీపీ పాలనలో విశాఖలో జరిగిన కొన్ని సదస్సులలో ఎవరిని పడితే వారితో ఒప్పందాలు చేసుకున్నట్లు చూపించారు. తీరా పరిశీలిస్తే అవన్ని ఉత్తిత్తి ఒప్పందాలుగా తేలాయి.
చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!
ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాబోతున్నాయని ఊదరగొట్టారు.. కాని వాటిలో వచ్చినవి అతి స్వల్పం అని చెప్పాలి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని కూడా ప్రచారం చేసేవారు. అవన్ని భ్రమలేనని ఆ తర్వాత అందరికి అవగాహన అయింది. అందువల్లే టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్దతిలో పరిశ్రమల స్థాపనకు యత్నిస్తున్నారు. అందువల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వరసగా మూడేళ్లు నెంబర్ ఒన్ స్థానంలో రాష్ట్రం ఉంది.
టీడీపీ మీడియా ఎంతగా అడ్డుపడుతున్నా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. పోర్టుల ఏర్పాటు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, కొప్పర్తి పారిశ్రామికవాడ, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌లు, సెంచురి ప్లైవుడ్ ప్లాంట్, కాకినాడ వద్ద ఫార్మా హబ్ తదితర పలు పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ సమ్మిట్ కు నాందీగా జరిగిన ఈ సన్నాహక సదస్సు సఫలం అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటిని గమనిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టబడులు వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం కలుగుతోంది. వియ్ విష్ ఆంద్రప్రదేశ్ ఆల్ ద బెస్ట్ !
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment