
సాక్షి, అమరావతి: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదటి విడత హవాను కొనసాగిస్తూ టీడీపీ ముఖ్యనాయకుల స్వగ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ జెండా ఎగిరింది. వివరాల్లోకెళ్తే.. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అల్లు రవణమ్మ 122 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
♦ ఇదే జిల్లాలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి స్వగ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ అభిమాని 408 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
♦ కర్నూలు జిల్లాలో ఇల్లూరి కొత్తపేటలో వైఎస్సార్‌సీపీ అభిమాని గోరంట్ల వెంకటరమణ గెలిచి టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు.
♦ కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్సార్‌సీపీ అభిమాని రుద్ర విజయం సాధించారు.
♦మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం రాప్తాడు 58 పంచాయతీలుండగా.. వైఎస్సార్‌సీపీ అభిమానులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.
♦ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంగాలలో వైఎస్సార్‌సీపీ అభిమాని విజయం సాధించారు.
♦ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 130 పంచాయతీలకు గాను 117 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు.
♦ విశాఖ జిల్లా కొత్తకోటలో వైఎస్సార్‌సీపీ అభిమాని కోన లోవరాజు 1,839 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
♦ విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం సాలిక మల్లవరంలో వైఎస్సార్‌సీపీ అభిమాని పెదిరెడ్ల నూకరత్నం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు.
♦ గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు దండా రోశమ్మ ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
♦ ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీలో వైఎస్సార్‌సీపీ అభిమాని గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment