సాక్షి, విశాఖపట్నం: రామోజీరావు ఓ విషసర్పమని ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడును అడ్డుపెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా అమరావతిలో కొన్న భూముల కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు పత్రిక చంద్రబాబు కరపత్రికగా మారిపోయిందన్నారు.
గతంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినట్టే ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ జగన్‌ను కూడా గద్దె దించాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును అధికారంలోకి తేవడమే రామోజీరావు అంతిమ లక్ష్యమన్నారు. మొదట్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ మంచిగానే నడిచిందని.. అయితే డిపాజిట్లు మళ్లించడం ప్రారంభించినప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయన్నారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసులో సీఐడీ అధికారులు ఏ–1గా ఉన్న రామోజీరావును, ఏ–2గా శైలజా కిరణ్‌ను విచారిస్తున్న నేపథ్యంలో సంస్థలో లోపాలు, నిధుల మళ్లింపులను మార్గదర్శిలో చాలా కీలకంగా వ్యవహరించిన రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వివరించారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఈగో ఫీలింగ్‌తో ఈనాడు ప్రారంభమైంది..
ఒకసారి కేఎల్‌ఎన్ ప్రసాద్‌తో రామోజీరావు మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగింది. పేపర్ ప్రారంభించడమంటే సులభం కాదన్న మాటలతో రామోజీలో ఈగో ఫీలింగ్ తలెత్తింది. ఎందుకు సులభం కాదో చూద్దామని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఎంటీ రాజుకు చెందిన బిల్డింగ్ చూశాం. 1974 ఆగస్టు 10న ఫౌండర్ ఎండీగా నేను వ్యవహరిస్తూ ఈనాడు ప్రారంభించాం.
నంబర్‌వన్ పేపర్‌గా వచ్చేంత వరకూ నేను కృషి చేశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మొదలు పెట్టినప్పుడు భానోజీరావు, మాజీ మంత్రి వెంగళరావుతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే భానోజీరావుకు చెందిన స్థలంలో డాల్ఫిన్ హోటల్ పెట్టేందుకు వెంగళరావుతో సిఫారసు చేయించారు. అయితే డాల్ఫిన్ హోటల్‌లో అనుకున్నంతగా డబ్బులు రాలేదు.
రామోజీ దీన్ని ఓర్వలేకపోయారు..
మార్గదర్శి చిట్‌ఫండ్స్ చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత రామోజీకి బ్రాంచ్‌లు విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు నన్ను పిలిచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ విస్తరిస్తామని చెప్పారు. విజయవాడలో మొదటి బ్రాంచ్ ఏర్పాటు పనుల్ని రెండు మూడు నెలల్లోనే ప్రారంభించాం. ఆ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సహా 8 బ్రాంచ్‌లను వెంటనే మొదలుపెట్టాం. క్రమంగా చిట్స్ పెరిగాయి.
అప్పట్లో ఆ నగదును ఎటూ మళ్లించకపోవడంతో మార్గదర్శి బాగానే ఉంది. ఇంతలో ఈనాడు క్రమంగా విస్తరించి నంబర్‌వన్‌గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్‌పై దృష్టిసారించాం. ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకొని.. అద్భుతంగా తీర్చిదిద్దాను. ఈనాడు, డాల్ఫిన్.. ఇలా అన్నింటిని లీజుకు తీసుకున్న స్థలాల్లోనే నడిపాం. అందుకే మాకు లీజు మాస్టర్లు అని పేరొచ్చింది. నన్ను చూసే ఆ స్థల యజమానులు లీజులకు ఇచ్చారు. దీన్ని కూడా రామోజీ ఓర్వలేకపోయారు. నేను ఎదిగిపోతానేమోననే భయం రామోజీని వెంటాడింది.
అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు..
ఒక స్థాయి వరకూ డిపాజిట్లు తీసుకునేంత వరకూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాగానే ఉంది. ఈ డిపాజిట్లను మొదట ఈనాడు, డాల్ఫిన్ విస్తరణకు తరలించాం. ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. లాభాలు రాగానే తిరిగి మళ్లీ మార్గదర్శిలోకి మళ్లించేవాళ్లం. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనలను కఠినతరం చేసింది. ఆ సమయంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి అభిప్రాయాల్ని తీసుకున్నాం. దాని లూప్‌హోల్‌ని పసిగట్టిన రామోజీరావు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించడం మళ్లీ మొదలు పెట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించడంతో నిధుల మళ్లింపును నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు. ఈనాడు అప్పటికే అగ్రస్థానానికి చేరుకోవడంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై పోరాటం మొదలుపెట్టారు.
వైఎస్సార్ చొరవతో కొంతమందికి చెల్లింపు
2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్‌ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్‌ని పట్టుకున్నారు.
రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు.
మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు..
మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్‌లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు.
వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు.
అక్రమాలకు వజ్రాయుధంగా ఈనాడు..
అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఈనాడుని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గతంలో అలానే ఉపయోగపడింది. కానీ.. రానురానూ ఈనాడుని స్వార్థానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. తమ అక్రమాలకు పత్రికని వజ్రాయుధంగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఈనాడు ఎంతో ఉపయోగపడింది.
ఎన్టీఆర్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఈనాడు రిపోర్టర్ల ద్వారా అభ్యర్థుల పేర్లుని ఎంపిక చేసి నేనే ఉత్తరాంధ్ర నుంచి 37 పేర్లు పంపించాను. దాన్నే ఎన్‌టీఆర్ పరిగణనలోకి తీసుకోవడం.. వారంతా విజయం సాధించడంతో నాపై ఆయనకు నమ్మకం కలిగింది. ఆ సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించారు. ఆ పేర్ల జాబితాని రామోజీరావుకు ఎన్టీఆర్ వినిపించడంతో.. రామోజీ నన్ను ఫోన్ చేసి అడిగారు. నాకు తెలీదని చెప్పాను. ఎక్కడ రాజకీయాల్లో ఎదిగిపోతానో అనే భయంతో రాజకీయాల్లోకి వద్దని అడ్డుకున్నారు.
రామోజీ భయపడ్డారు..
మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది.
గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్‌ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్‌కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు.
లెక్కలన్నీ పక్కాగా ఉంటే భయమెందుకు?
వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్‌గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు?
టీడీపీకి కరపత్రంగా ఈనాడు మారిపోయింది
ప్రస్తుతం మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న విషయాన్ని రామోజీ గ్రహించారు. వాటిని ప్రజల్లోకి వెళ్లకూడదని భావించారు. అందుకే... టీడీపీ నేతలు, తెలిసినవారితో పత్రికపై దాడి చేస్తున్నారంటూ మాట్లాడిస్తున్నారు. డిపాజిట్లు అంటే ఏమిటో, చిట్స్ అంటే ఏమిటో తెలియనివారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈనాడుపై దాడి, మార్గదర్శిపై దాడి అని మాట్లాడుతున్నారు.
ఈనాడు తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉంది. కాబట్టి.. వారు దీన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది కరెక్టో, కాదో.. డిపాజిటర్లని విచారించాలి. ప్రతివాదుల్ని పిలవకుండా.. గతంలో కేసు కొట్టించేశారు. ఇప్పుడు మళ్లీ పోరాటం జరుగుతోంది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇప్పుడు మార్గదర్శికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి రామోజీరావే ప్రధాన కారణం.
రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది..
ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్‌సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్‌సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment