డొనేట్‌కార్ట్. స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు మధ్య వారధి. ఏ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ అయినా వెబ్‌సైట్‌లో వారి సేవలకు అవసరమైన వస్తు, సామగ్రి, పరిమాణాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా దాతలు అందుకు అవసరమైన మొత్తాన్ని డొనేట్‌కార్ట్‌కు సమకూరుస్తారు. ఆ నగదుతో సంబంధిత స్వచ్ఛంద సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన అవసరాలను సమకూరుస్తుంది. వెబ్‌సైట్ వేదికగా పని చేస్తున్న ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి. 26 ఏళ్ల ఈ యువకుని స్వగ్రామం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడి. ఫోర్బ్స్ జాబితాలో ఈ సంస్థ చోటు దక్కించుకోవడంతో ఈ యువకుడి సేవాగుణం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, చిత్తూరు: కష్టాలను కళ్లారా చూసి.. సావాసం చేసి.. పోరాడి నిలిస్తే ఆ నీడ ఎంతో మందికి సేదతీరుస్తుంది. ఓ నిరుపేద కుటుంబం.. అందునా వ్యవసాయమే ఆధారం.. చదువును పెట్టుబడిగా మలుచుకుని రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి పది మందికి సహాయపడే స్థాయికి చేరుకున్నాడు. లక్ష్యం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుందని నిరూపించాడు ఓ మారుమూల అటవీ సరిహద్దు గ్రామ యువకుడు. ఇప్పుడు అతని పేరు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఊరంతా గర్వపడుతోంది. బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడికి చెందిన రైతు దంపతులు సుశీలమ్మ, గోవిందరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం.
రెండో కుమారుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి బి.కొత్తకోటలో ప్రాథమిక విద్య, తిరుపతిలో 9, 10.. నెల్లూరులో ఇంటర్, నాగ్‌పూర్‌లో ఎన్‌ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రోఫోర్స్ సంస్థలో ఏడాదికి రూ.8 లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరలేదు. సొంతంగా ఓ సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఎన్‌ఐటీ నాగ్‌పూర్‌లో చదివిన తెలంగాణలోని కోదాడకు చెందిన సందీప్ శర్మతో కలిసి డొనేట్‌కార్ట్‌ను 2016 అక్టోబర్ 11 ప్రారంభించగా ఇందులో మహారాష్ట్రకు చెందిన సారంగ్ బోబాడే సహా వ్యవస్థాపకులుగా సంస్థను నడిపిస్తున్నారు.
చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!
వినూత్న ఆలోచన
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డొనేట్‌కార్ట్ సంస్థ ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 గ్రూపు ఎన్‌జీఓలు–సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ విభాగంలో స్థానం దక్కించుకుంది. 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు నిర్వహిస్తున్న 30 సంస్థలను ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేయగా అందులో డొనేట్‌కార్ట్ ఒకటి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి అందరిలా ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడితే చాలనుకోలేదు. తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుని బలంగా సంకల్పించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘సేవల వారధి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
రూ.5వేల కోట్ల విరాళాలు లక్ష్యం
2016 ఆగస్టులో మా సంస్థను స్థాపించగా ఇప్పటి వరకు 10లక్షలకు పైగా దాతల నుంచి రూ.150 కోట్ల విరాళాలు సేకరించాం. భవిష్యత్తులో విరాళాలను రూ.5వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. విరాళాలు అత్యధికంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల నుంచే అందుతున్నాయి.
– బి.అనిల్‌కుమార్‌రెడ్డి, ఫోర్బ్స్ సహ వ్యవస్థాపకుడు
వెబ్‌సైట్ వేదికగా..
మొదట నాగ్‌పూర్‌లో వెబ్‌సైట్ వేదికగా ప్రారంభమైన డొనేట్‌కార్ట్ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ రెండుచోట్లా పనిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డొనేట్‌కార్ట్ రూ.90 కోట్ల టర్నోవర్ సాధించింది. స్వచ్ఛంద సంస్థలకు సమకూర్చాల్సిన వస్తు సామగ్రిని బల్క్‌గా కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఆ మొత్తమే రూ.90కోట్లు. ఈ నిధుల నుంచే సంస్థలో పనిచేస్తున్న 75 మంది ఉద్యోగులకు వేతనాలు, ఖర్చులు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు నెలసరి వేతనం రూ.25వేల నుంచి రూ.4లక్షల వరకు చెల్లిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment