అగ్రదేశాల్లో.. మనం | DRDO Support for young engineers | Sakshi
Sakshi News home page

అగ్రదేశాల్లో.. మనం

Published Sun, Dec 19 2021 5:36 AM | Last Updated on Sun, Dec 19 2021 9:42 AM

DRDO Support for young engineers - Sakshi

సతీష్‌రెడ్డిని సన్మానిస్తున్న హేమచంద్రారెడ్డి, వీసీ రంగ జనార్దన తదితరులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్‌టీయూ–అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ..

అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే..
అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్‌–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్‌ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్‌ ఇండియా నుంచి మేడ్‌ ఫర్‌ ద వరల్డ్‌’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్‌ టాప్‌–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్‌ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం.

‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్‌ శుభవార్త 
అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్‌ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది.

యువ ఇంజనీర్లకు డీఆర్‌డీవో చేయూత
అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్‌డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్‌టీయూ(ఏ) ఇంజనీరింగ్‌ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్‌టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్‌ (డిఫెన్స్‌ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్‌(డిఫెన్స్‌ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్‌టీయూ(ఏ)లో డీఆర్‌డీవో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్‌ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్‌ సి.శశిధర్, ప్రిన్సిపాల్‌ పి.సుజాత పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement