అనంతపురంలో భారీ డ్రోన్‌ సిటీ | Drone City WIll Establish In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో భారీ డ్రోన్‌ సిటీ

Nov 20 2020 8:51 AM | Updated on Nov 20 2020 1:08 PM

Drone City WIll Establish In Anantapur - Sakshi

సాక్షి, అమరావతి : వేగంగా విస్తరిస్తున్న డ్రోన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం అనంతపురం జిల్లాలో భారీ డ్రోన్‌ సిటీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు డ్రోన్‌ తయారీ, పరిశోధన అభివృద్ధి, పరీక్ష కేంద్రాలను ఒకేచోట ఏర్పాటు చేసే విధంగా 360 ఎకరాల్లో భారీ డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ వి.ఎన్‌.భరత్‌రెడ్డి తెలిపారు. ఈ డ్రోన్‌ సిటీలో భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా 38 కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. (అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం!)

వీటిని పరిశీలించిన తర్వాత అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలను ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే అనంతపురంలో కంటికి కనిపించనంత దూరంగా (బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌ – బీవీఎల్వోఎస్‌) డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి ఇవ్వడంతో ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అనంతపురాన్ని శాశ్వత డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంపై దృష్టిపెడుతున్నామని, దీనికోసం పుట్టపర్తి విమానాశ్రయాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.

భారీగా పెరుగుతున్న డిమాండ్‌
భూముల సర్వే, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, సరుకుల డెలివరీ.. ఇలా అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా డ్రోన్‌పై పరిశోధనల్లో అత్యధిక నిధులను అందుకుంటున్న దేశాల్లో మన దేశం ఒకటి. ఏటా దేశీయ డ్రోన్‌ మార్కెట్‌ 22 శాతం వృద్ధి చెందుతూ సుమారు రూ.6,554.18 కోట్లకు చేరింది. ఇందులో మెజార్టీ వాటాను కైవసం చేసుకునే దిశగా ఏపీఏడీసీఎల్‌ పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. దీన్లో భాగంగానే దేశంలో తొలిసారిగా అనంతపురం జిల్లాలో డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేసి డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ బరువును తీసుకువెళ్లే వాటి దగ్గర నుంచి వ్యవసాయరంగంలో వినియోగించేందుకు 250 కిలోల బరువును మోసుకెళ్లే డ్రోన్ల వరకు తయారీకి ఈ డ్రోన్‌ సిటీ వేదిక కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement