‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి | Drop In Coconut Exports From Joint Westgodavari Worries Farmers | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి

Published Sun, Aug 28 2022 12:06 PM | Last Updated on Sun, Aug 28 2022 12:19 PM

Drop In Coconut Exports From Joint Westgodavari Worries Farmers - Sakshi

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి ఎగుమతులు పతనమవుతున్నాయి. మార్కెట్‌ పుంజుకుంటున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఢీలా పడ్డాయి. దీంతోపాటు నాణ్యతపరంగా పొరుగు రాష్ట్రాల్లో పంట బాగుండటంతో మన మార్కెట్‌ డౌన్‌ అయ్యింది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 30 లారీల కొబ్బరి ఎగుమతి చేస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి మార్కెట్‌ పుంజుకుంటున్న సమయంలో తమిళనాడు, కేరళ కొబ్బరి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి నుంచి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం వద్ద రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వార కాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంది. సీజన్‌లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి చేస్తారు. శ్రావణమాసం సందర్భంగా కొద్దిరోజుల ముందు వరకూ ఎగుమతులు బాగున్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.  

లారీకి 30 వేల కాయల వరకు.. 
చిన్నలారీలో సుమారు 20 వేలు, పెద్ద లారీలో 30 వేల వరకు కాయలను లోడు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 30 లారీల పంట ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం పాత, కొత్త కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడులో కొబ్బరి కాయల ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగున్నాయి.  

డిమాండ్‌ ఎక్కడెక్కడంటే..  
గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిసా, హర్యానా రాష్ట్రా ల్లో సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి కాయకు డిమాండ్‌ ఉంటుంది. జిల్లా నుంచి పీచు కాయ గుజరాత్‌కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. బెల్ట్‌ ఫోర్‌ పట్టా రకాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి ఎగుమతుల్లో  రాష్ట్రంతో తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఆంధ్రా కొబ్బరి ఎగుమతి అధికంగా ఉండటంతో పాటు ధర రూ.15 వరకూ పలికింది. ఒక్కసారిగా తమిళనాడు, కేరళలో దిగుబడులు పెరగడంతో మన మార్కెట్‌లో ధరలు తగ్గాయి.  

పరిశోధనా కేంద్రాలు కీలకం 
పరిశోధనా కేంద్రాల సూచనలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో రైతులు కొబ్బరి సాగుచేస్తున్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అంబాజీపేటలో మినహా మరెక్కడా కొబ్బరి పరిశోధనా కేంద్రం లేకపోవడంతో రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోయింది.  

విస్తీర్ణం తగ్గుతూ..  
జిల్లాలో గతంలో సుమారు 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేసేవారు. ఆక్వా విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. ఆక్వా చెరువు గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లకు నల్లి తెగులు సోకడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. కొబ్బరి కాయపై మచ్చలు ఏర్పడటం, కాయ పరిమాణం తగ్గడంతో రైతులు లాభాలను అందుకోలేకపోతున్నారు.  

పరిశోధనా కేంద్రం అవసరం  
తమిళనాడు, కేరళతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్‌ పెరగాలంటే ఇక్కడ పండించే కొబ్బరి కాయకు మచ్చ లేకుండా ఉండాలి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఉండాలి. వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే తమిళనాడు కొబ్బరి పంట అందుబాటులో ఉంటే మన పంటకు డిమాండ్‌ తగ్గుతుంది.  
– దేవరపు లక్ష్మీనారాయణ, పాలకొల్లు కొబ్బరి మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
 
డిమాండ్‌ తగ్గింది  
శ్రావణమాసం పూర్తికావడంతో మహారాష్ట్రలో డిమాండ్‌ తగ్గింది. ప్రస్తుతం శూన్యమాసం కావడం, తమిళనాడు, కేరళæ పంట అందు బాటులోకి రావడంతో మన మార్కెట్‌ పతనమవుతోంది. ఇటీవల జిల్లాలో వరదలు రావడంతో చెట్లు సుమారు 20 రోజులు నీటిలో ఉండటంతో కాయల్లో నాణ్యత తగ్గింది. డొక్క, పీచు ఇలా అన్ని 
రంగాల్లో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.  
– మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోకోనట్‌ కోప్రా మర్చంట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement