అనంతపురం: గత 24 సంవత్సరాల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. డీఎస్సీ–1998 అర్హత పొందిన అభ్యర్థుల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో డీఎస్సీ –1998లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశం కల్పించింది. ఏకంగా పదవీ విరమణ చేసే వరకు మినిమం టైం స్కేలు విధానంలో కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది.
ఈ నేపథ్యంలో అనంతపురంలోని జిల్లా సైన్స్ సెంటర్‌లో గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి డీఎస్సీ –1998 అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులుగా అవకాశం దక్కుతుందనే ఆశ కూడా లేని పరిస్థితి నుంచి మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని కొనియాడారు. థ్యాంక్యూ ... సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1998 డీఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చల్లా రామాంజనేయులు, రమణ, నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం: డీఎస్సీ–1998లో అర్హత పొంది మినిమం టైం స్కేల్ కింద పనిచేయడానికి ఆన్‌లైన్‌లో అంగీకారం తెలిపిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైనట్లు డీఈఓ కే.శామ్యూల్ తెలిపారు. జిల్లా సైన్స్ సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 570 మంది అభ్యర్థులకుగాను తొలి రోజు 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించామన్నారు. 8 నుంచి 12 వరకు రోజూ 100 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. అభ్యర్థుల జాబితా డీఈఓ బ్లాగ్‌స్పాట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment