సాక్షి, అమరావతి: రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, ఎక్కడా వాటిని ఉల్లంఘించలేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు ఆర్బీఐ నిబంధనల మేరకే ప్రభుత్వం వెళ్లిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలపై ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే వ్యవహరించామని, ఇందులో ఎక్కడా తప్పు లు జరగలేదన్నారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం, కార్పొరేషన్ల ద్వారా పూచీకత్తు ఇచ్చి రుణాలు తీసుకోవడాన్ని నేరంగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చిత్రీకరించడం దారుణమని, సీబీఐ విచారణ కోరడం విడ్డూరమన్నారు.
యనమల ఆర్థిక మంత్రిగా ఉండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా రుణాలు తీసుకున్నారని, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఆయన హయాంలో తీసుకుంటే ఒప్పు.. ఇప్పుడు తీసుకుంటే నేరమా? అని ప్రశ్నించారు. వీటి గురించి గత సర్కారు హయాంలో నోరెత్తని కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా కథనాలు ఎందుకు ప్రచురిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈమేరకు బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
► రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ సంస్థల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్ బయట రుణాలు తీసుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణాలకు పూచీకత్తు ఇస్తుంది. ఇదేమీ కొత్త కాదు. రాజ్యాంగ విరుద్ధమూ కాదు. ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కేంద్రం అనుమతి అవసరం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో చూస్తే ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా రూ. 1,35,292.51 కోట్లు రుణం తీసుకున్నట్లుంది.
► విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా చేసిన అప్పు రూ.14,028.22 కోట్లు కాగా 2014–19లో టీడీపీ సర్కారు ఏకంగా రూ.63,664.64 కోట్లకు పెంచేసింది. యనమల ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ బయట అప్పులు 450 శాతం పెరిగాయి. పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో ఏకంగా రూ.20,000 కోట్లు అప్పు చేశారు.
► టీడీపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.63,664.64 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,17,503.08 కోట్లకు చేరాయి.
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే అప్పులను ఎక్కడా దాచడం లేదు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో వివరాలు స్పష్టంగా ఉన్నాయి.
► ఓ పత్రిక అప్పులపై అవాస్తవాలను ప్రచురించింది. రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,26,836 కోట్లుగా పేర్కొనడం అవాస్తవం. రాష్ట్ర అప్పులు రూ.4,13,000 కోట్లు కాగా అధికారికంగా విడుదల చేసిన అంచనాల మేరకు అది రూ.3,90,670 కోట్లే.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.1,38,603.58 కోట్లుగా పేర్కొనడంలో కూడా నిజం లేదు.
► గత సర్కారు హయాంలో అప్పులు ఏకంగా 20.39 శాతం మేర పెరగ్గా ఇప్పుడు కేవలం 15.46 శాతమే పెరిగాయి. కోవిడ్ కారణంగా ఒకపక్క ఆదాయం క్షీణించగా మరో పక్క వ్యయం పెరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా పారదర్శకంగా నగదు బదిలీతో పేదలను ప్రభుత్వం ఆదుకుంది. సామాజిక, ఆర్థిక ప్రగతి, మానవ వనరుల వృద్ధి వ్యయాన్ని కూడా అభివృద్ధిగానే పరిగణించాలి.
► వేస్ అండ్ మీన్స్‌కు 2018–19లో ఆర్బీఐ 144 రోజులు అనుమతిస్తే గత సర్కారు 107 రోజులు వినియోగించుకుంది. 2020–21లో కోవిడ్ సమయంలో ఆర్బీఐ 200 రోజులు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 రోజులే వినియోగించుకుంది. వేస్ అండ్ మీన్స్‌ను ఆర్బీఐ నిబంధనలకు లోబడి తక్కువ వడ్డీకి వినియోగించుకోవడంలో తప్పులేదు.
► దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.45 శాతం ఉండగా ఇప్పుడు కోవిడ్ సమయంలోనూ ఏపీ వాటా 5.01 శాతంగా ఉంది.
► కాగ్ ప్రస్తావించిన రూ.48,384 కోట్లు సర్దుబాటు మాత్రమే.. అది వ్యయం కాదు. ఇందులో కేవలం రూ.224.73 కోట్ల మేర మాత్రమే నగదు లావాదేవీలు జరిగాయి. మిగతా మొత్తం అంతా సర్దుబాటు మాత్రమే. దీనిపై కాగ్‌కు వివరణ ఇచ్చాం. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థే దీనికి కారణం.
► 2015–16లో టీడీపీ హయాంలో ఏకంగా 14,721 కొత్త వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలను తెరిచారని, దీనిపై రికార్డులు లేవని కాగ్ ఆడిట్‌లో తప్పుబట్టింది. 42,999 వ్యక్తిగత డిపాజిట్‌ల నుంచి రూ.41,001.13 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని, ఈ ఖాతాలు, ఖర్చులకు సంబంధించి ప్రామాణికతను పరిశీలించేందుకు సరైన యంత్రాంగం లేదని కాగ్ ఆడిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం టీడీపీ నేతలకు, వారి అనుకూల మీడియాకు కనపడదా?
రూల్ ప్రకారమే రుణాలు
Published Thu, Mar 31 2022 3:29 AM | Last Updated on Thu, Mar 31 2022 8:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment