ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ అధికారుల తనిఖీలు, అక్కినేని ఆస్పత్రి చైర్‌పర్సన్ మణిని తరలిస్తున్న ఈడీ అధికారులు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: టీడీపీ పెద్దల గుప్పిట్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్‌ల నివాసాలలో ఈడీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.
ఈనాడు రామోజీరావుకు సమీప బంధువు కూడా అయిన ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి నివాసంతోపాటు విజయవాడలో ఆమె నిర్మించిన ‘అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి’లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 40 మంది ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా 8 గంటలపాటు సోదాలు నిర్వహించడం గమనార్హం. అక్కినేని మణి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు.
విజయవాడ భారతీనగర్‌లోని అక్కినేని ఉమెన్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు ఎలా సమకూర్చారని ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధులను దారి మళ్లించి, ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు భావిస్తున్నారు. అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణ బిల్లులను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రినిధుల నుంచి చెల్లించడం గమనార్హం. ఈ మేరకు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించి, అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ పెద్దల పాత్రపైనా దృష్టి
టీడీపీ పెద్దలు తమ అక్రమాలకు అక్షయపాత్రగా ఎన్‌ఆర్‌ఐ అకాడమీని వాడుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజ) కుటుంబం నియంత్రణలో ఎన్‌ఆర్‌ఐ అకాడమీ పాలక మండలి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆలపాటి రాజ, ఆయన సతీమణి కీలకంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపు వ్యవహారం వెనుక వీరి కుటుంబం పాత్రపైనా ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వైద్య పరికరాల కొనుగోలు పేరిట కూడా నిధులు నొక్కేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించిన తన సోదరుడు రవి ద్వారా రాజా ఈ వ్యవహారాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి చేతిలో ఎన్‌ఆర్‌ఐ అకాడమీ రిమోట్ కంట్రోల్ ఉందన్నది బహిరంగ రహస్యం.
ఈ అకాడమీలో అక్రమాలపై కేసులు నమోదైన నేపథ్యంలో సుజనా చౌదరి వ్యూహాత్మకంగా తన సన్నిహితుడిని ఆస్పత్రిలో కీలక స్థానంలో చేర్చారు. ఆయన ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు దారి మళ్లించారు. కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా యత్నించారని తెలుస్తోంది. కంప్యూటర్లలో హార్డ్ డిస్క్‌లను గల్లంతు చేసినట్టు సమాచారం.
ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, డైరెక్టర్లు, ఇతర కీలక వ్యక్తుల నివాసాల్లో ఈడీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగిస్తారని సమాచారం. కాగా తాజా సోదాలపై ఈడీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
సీట్ల పేరిట భారీగా వసూలు
చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రితోపాటు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కూడా నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. 2020–21లో ఆస్పత్రి నిధులను ఎన్‌ఆర్‌ఐ పాలక మండలి సభ్యులు తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న దాదాపు 2 వేల మంది వివరాలను కూడా ఈడీ అధికారులు అడగడం గమనార్హం.
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో కొందరు ఉద్యోగులను అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ముందుగా వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారని తెలిసింది. ఆ సమాచారం ఆధారంగానే కొందరు ఆస్పత్రి ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment