► విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై పచ్చ పత్రికలు పట్టాలు తప్పాయి. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అజెండాలో అసలు రైల్వే జోన్ అంశమే లేదు. అజెండాలో లేని అంశాన్ని చర్చించినట్లుగా, రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని తప్పుడు రాతలు రాశాయి.
తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లాలన్నది వాటి పన్నాగం. దీనిపై వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి దీటుగా స్పందించారు. రైల్వే జోన్ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని, వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతిని మాకు రాసిస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ.. రైల్వే జోన్ కచ్చితంగా ఏర్పాటవుతుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. కొన్ని పత్రికలు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు.
రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా
సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచురించాయని ధ్వజమెత్తారు. విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు.
రైల్వే జోన్ వస్తే రామోజీరావు, రాధాకృష్ణ వారి పత్రికలను మాకు అప్పగిస్తారా? అని సవాల్ చేశారు. ఒకవేళ రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను ప్రజలెవరూ విశ్వసించరని చెప్పారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే రామోజీ, రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెబుతారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
► విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి రైల్వే జోన్ రావట్లేదని, అది కలగా మిగిలిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ కథనాలను ప్రచురించాయి. రైల్వే మంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కలిసినప్పుడు అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్వయంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.
► ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రైల్వే జోన్ రాదని ఊహల్లో బతుకుతూ వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వారి పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు
చెబుతారా?
► పునర్విభజన చట్టంలో రైల్వేజోన్‌కు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి హైదరాబాద్‌తో అనుసంధానించాలనే అంశంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. అంతేకానీ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన చర్చ జరగలేదు.
► విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది. రైల్వే జోన్ కోసం వైఎస్సార్‌సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నూటికి నూరుశాతం విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రచురిస్తూ కులాభిమానంతో స్థాయిని దిగజార్చుకోవద్దు.
పట్టాలు తప్పి పిచ్చి రాతలు!
Published Thu, Sep 29 2022 4:12 AM | Last Updated on Thu, Sep 29 2022 12:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment