
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ కడుపు మంటను భరించలేకపోతున్నారు! సొంత కార్లున్న చంద్రబాబు, లోకేశ్‌కు సైతం వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని అందించాల్సిందే అన్నట్లుగా ఉంది ఆయన కథనాల తీరు! ఆటోలు, ట్యాక్సీలు, మేక్సి క్యాబ్‌లను కొనుగోలు చేసి సొంతంగా నడుపుకునే వారి కోసం ఆ పథకాన్ని రూపొందించారన్న విషయాన్ని రామోజీ గుర్తుంచుకోవాలి! దీన్ని విస్మరిస్తూ ‘వాహన మిత్రకు మిగిలింది వాతే’ అంటూ మరోసారి అక్కసు వెళ్లగక్కారు.
నాలుగేళ్లలో 2.74 లక్షల మందికి రూ.1,041.03 కోట్లు
సొంతంగా ఆటోలు, ట్యాక్సీలను కొనుగోలు చేసి జీవనోపాధి కోసం నడుపుకొనే వారికి చేయూతనిచ్చేందుకు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వాహనానికి బీమా, ఫిట్‌నెస్, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామన్న హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
నాలుగేళ్లలో నాలుగు విడతలుగా 2,74,015 మందికి రూ.1,041.03 కోట్ల సాయాన్ని అందచేశారు. అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తూ సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో జాబితాలను ప్రకటిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా ఏటా రెండు దఫాలు పరిశీలన అనంతరం పథకాన్ని వర్తింప చేస్తున్నారు.
పెట్రోల్‌పై బాదుడు పాపం బాబుదే
అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ ఈనాడు పత్రిక రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నించింది. పెరిగిన ఇంధన ధరలతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కాకి లెక్కలు ప్రచురించింది. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌పై అదనపు భారాన్ని వేసింది చంద్రబాబు ప్రభుత్వమే అన్నది రామోజీ ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయినట్లుంది. 2015 ఫిబ్రవరి 5కు ముందు రాష్ట్రంలో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ ఉండగా ఆ పన్నులను టీడీపీ ప్రభుత్వం అమాంతం మార్చేసింది.
పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున ధరలను పెంచింది. ఆ వాస్తవాన్ని చెప్పకుండా ఈనాడు బురద చల్లుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కోవిడ్ మహమ్మారితో రెండేళ్లు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఇక టీడీపీ హయాంలో రోడ్ల మరమ్మతులను గాలికి వదిలేయడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి పునరుద్ధరణ కోసం లీటరుకు ఒక్క రూపాయి మాత్రమే రోడ్ సెస్ విధించాల్సి వచ్చింది. టీడీపీ హయాంలో భగ్గుమన్న ఇంధన ధరలతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై పడిన ఆర్థిక భారం లెక్కలను ప్రచురించే సాహసాన్ని రామోజీ చేయగలరా?.
Comments
Please login to add a commentAdd a comment