ఆయనే కర్త... కర్మ... క్రియ 1990ల మొదట్లో... మద్య నిషేధ ఉద్యమానికి... 1996 నుంచీ రాష్ట్రంలో అక్రమ మద్యం పెరిగిపోవటానికి... అలా పెరిగిపోయిందంటూ ‘ఈనాడు’విచ్చలవిడిగా రాయడానికీ... రైల్వే స్టేషన్లో రెండు బాటిళ్లు దొరికినా ఓ పేద్ద వార్త ప్రచురించడానికి... 1997లో చంద్రబాబు మద్య నిషేధం ఎత్తివేయటానికి... అన్నిటికీ ఆయనే కర్త..కర్మ... క్రియ. ఆయనే రామోజీరావు!!.
విచిత్రమేంటంటే ఈ 86 ఏళ్ల మద్య నిషేధ ఉద్యమకారుడు 1997లో చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసినపుడు తన పత్రిక ‘ఈనాడు’లో ఓ విచిత్రమైన సంపాదకీయం రాశాడు. ప్రభుత్వాలు నిషేధాన్ని అమలు చేయటం సాధ్యం కాదని, జనం ఎవరికి వారు తాగటం మానేస్తే తప్ప ఈ మహమ్మారిని అంతం చేయలేమని సూత్రీకరించాడు..
అలా నిషేధాన్ని ఎత్తేశాక తన రామోజీ ఫిలిం సిటీలోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో దేశ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టాడు. వాటిని మరింత తాగించడానికి బెల్లీ డ్యాన్సులు పెట్టాడు. వారానికో ప్రత్యేక కార్నివాల్‌ను పెట్టి... తన పత్రికలో ప్రకటనలిచ్చి మరీ జనాన్ని రప్పించి తాగించాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో నిషేధం అనేది ఎవరికి వారు విధించుకోవాలి తప్ప ప్రభుత్వమో... అమ్మకం దార్లో చేయటం కష్టం!. అంటే... ఎవరికి వారు తాగటం మానేయాలి తప్ప తాను మాత్రం అమ్ముతూనే ఉంటానని, ఇష్టం వచ్చిన వాళ్లు తాగొచ్చని చాలా పద్ధతిగా చెప్పారు. ఇదీ... ఈయన గారి పాత్రికేయ పాతివ్రత్యం!.
రామోజీరావు చాలా నికార్సయిన మనిషి. సిద్ధాంతానికి కట్టుబడే తత్వం. కాకపోతే ఆ సిద్ధాంతమే కాస్త తేడా!. అదేంటంటే తన చంద్రబాబు అధికారంలో ఉంటే మద్య నిషేధం అక్కర్లేదు. వేరెవ్వరు అధికారంలో ఉన్నా... మద్య నిషేధం కావాలి. లేదంటే ఊరుకోరు. అందుకే...
నాడు: బాబు హయాంలో ఊరూరా విరగకాసిన 43,000 బెల్టు షాపుల్ని ‘ఈనాడు’ ఏనాడూ చూడలేదు.
నేడు: ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎక్కడో ఒకటీ అరా నడుస్తున్నా... ‘3 పెగ్గులు–6 గ్లాసులు’ అంటూ తాగినట్లే ఊగిపోతారు.
నాడు: అప్పట్లో ఏకంగా 4,380 మద్యం దుకాణాలు... పక్కనే పర్మిట్ రూమ్‌లతో సహా మందు పోస్తుంటే అది విచ్చలవిడితనమని ‘ఈనాడు’కు అనిపించలేదు.
నేడు: షాపులో కొనుక్కుని ఎక్కడో పొలాల్లో తాగుతున్న వారిని కూడా ఫోటోలు తీసి... బెల్టు షాపులో కొని తాగుతున్నట్లుగా చిత్రీకరిస్తాడు.
నాడు: బాబు హయాంలో అమ్మే ఏ మద్యమైనా ఆయన దృష్టిలో అమృతమే.
నేడు: అవే డిస్టిలరీలు, అదే మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తుంటే... అది విషమంటూ నీచపు రాతలు రాస్తాడు. కోవర్టులతో కలిసి దొంగ టెస్టులు చేయించి మరీ దుష్ప్రచారానికి దిగుతాడు.
నాడు: చంద్రబాబు ఏ బ్రాండుకు అనుమతిచ్చినా అది చాలా గొప్పదని ‘ఈనాడు’ భావం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఆ పత్రిక దృష్టిలో అప్పట్లో గొప్పపేర్లు.
నేడు: బాబు దిగిపోవటంతో... ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన ఘోరమైన పేర్లంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు!! త్రీ క్యాపిటల్స్, స్పెషల్‌స్టేటస్ అంటూ లేని పేర్లను కూడా ఉన్నట్టుగా ఎల్లో రాతలు రాసి యాగీ చేస్తుంది.
► ఇక ఏ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం ఎంత మద్యం కొంటోందన్న విషయంలోనూ విషప్రచారమే. రాష్ట్రంలో చంద్రబాబు అనుమతిచ్చిన 20 డిస్టిలరీలుండగా... వాటిలో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లు ఇవ్వటం కూడా రామోజీరావు దృష్టిలో ‘అడ్డగోలు’ వ్యవహారమే. బాబు హయాంలో ఒకే డిస్టిలరీకి 15–20 శాతం ఆర్డర్లిచ్చినా అందులో ఎలాంటి తప్పూ కనిపించదు.
► ఇవన్నీ ఎందుకంటే... బేసిగ్గా చంద్రబాబు తప్ప వేరెవ్వరూ పదవిలో ఉండకూడదన్నది రామోజీరావు సిద్ధాంతం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వద్దనుకున్నాక రామోజీ అభీష్టంతో పనిలేదు కదా? కాకపోతే ఆ వాస్తవం రామోజీకి మూడున్నరేళ్లు గడిచినా జీర్ణం కావటంలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ కాలం మాదిరిగా తాను తలచుకుంటే ఎవరినైనా పదవిలో కూర్చోబెట్టగలనన్న అహం ఇప్పటికీ చావలేదు. విషపు రాతలతో ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని... అలా ప్రభుత్వ ఆదాయ వనరును దెబ్బతీస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలూ అమలు చేయలేని పరిస్థితిలో పడి ప్రజాభిమానాన్ని కోల్పోతుందనేది ఆయన పరమోద్దేశం. కాకపోతే ఇక్కడొక చిన్న లాజిక్‌ను రామోజీరావు మిస్సవుతూనే ఉన్నాడు.
మద్యంపై చెప్పింది చెప్పినట్టే...
రామోజీ మిస్సయిన లాజిక్కేంటంటే... అధికారంలో ఉన్నది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. మాటకు కట్టుబడే వైఎస్సార్ లక్షణానికి అక్షరాలా వారసుడు. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తూ వెళతానని ఎన్నికలకు ముందే చెప్పారాయన. ఆ నియంత్రణలో భాగంగానే... తాను ఎన్నికల్లో గెలిస్తే మద్యం ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తానని, అమ్మకాలను తగ్గిస్తానని చెప్పారు. అన్నట్టే ధరలు పెంచటంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
2018–19లో చంద్రబాబు హయాంలో 384.36 లక్షల మద్యం కేసులు విక్రయిస్తే 2021–22లో ఆ సంఖ్య ఏకంగా 277.16 లక్షలకు తగ్గింది. ఇక బీర్ల విక్రయానికొస్తే 2018– 19లో ఏకంగా 278.50 లక్షల కేసులు విక్రయించగా... 2021–22లో ఆ సంఖ్య కేవలం 82.60 లక్షలకు తగ్గిపోయింది. కాకపోతే ఇదేదీ రామోజీరావుకు కనిపించదు. బాబు హయాంలో చాలా పక్కాగా పరిమితంగా మద్యం విక్రయాలు జరిగినట్లు... ఇప్పుడేమో విచ్చలవిడిగా అమ్మేస్తున్నట్లు ఆయనకు కలలు వస్తుంటాయి. అవి ‘ఈనాడు’లో రాతల రూపంలో ప్రత్యక్షమవుతుంటాయి.
ఈ చర్యలు ‘ఈనాడు’కు ఎన్నడూ కనిపించవా?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను అడ్డుకోవడం అసాధ్యం కనక... ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. 4,380 మద్యం దుకాణాలను ఏకంగా 2,934కి తగ్గించడంతోపాటు విక్రయ వేళలను కుదించారు. అందుకే విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2020–21లో మద్యం విక్రయాలు 40%, బీర్ విక్రయాలు 73% తగ్గడమే ఇందుకు నిదర్శనం.
కాకపోతే ఇలా తగ్గిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇంత తగ్గినా... మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టి అమ్మేస్తున్నారని చేతికొచ్చిన రాతలు రాసి అచ్చేస్తుంటుంది. బెల్టు షాపులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదని, పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి అక్రమంగా మద్యం విక్రయించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను (సెబ్) ఏర్పాటు చేసింది. సెబ్‌కు ఎవ్వరైనా ఫిర్యాదు చేసేలా ఆ ఫోన్ నెంబర్‌ను మద్యం దుకాణాల వద్ద కూడా ప్రదర్శిస్తోంది.
రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన వ్యవస్థ చాలా పెద్దది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒకటో రెండో చోట్ల అనధికారికంగా విక్రయించటం జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే ఇది 1 శాతానికన్నా తక్కువే. కాకపోతే రామోజీరావు మాత్రం దీన్నే వంద శాతంగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకటో రెండో చోట్ల జరిగిన సంఘటనలను చూపిస్తూ... మొత్తం రాష్ట్రమంతటా ఇలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం మొత్తం 100 శాతం అక్రమ విక్రయాలు జరిగినా పెన్నెత్తి రాయడు.
ఒక్కచోట కూడా అక్రమం జరిగినట్లు చెప్పడు. అసలు బాబు హయాంలో బెల్టు షాపుల్ని నియంత్రించడానికి గానీ, షాపుల్లో మద్యం ధరలను పెంచి విక్రయిస్తే అడ్డుకోవటానికి గానీ ఏదైనా వ్యవస్థ ఉందా? ఇప్పుడలా కాదు కదా? గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో మద్యానికి సంబంధించి ఎన్ని కేసులు బుక్ చేశారో తెలుసా? ఎందరిని అరెస్టు చేశారో తెలుసా? ఎన్ని వాహనాలను సీజ్ చేశారో తెలుసా? మరి ఇన్ని చేస్తున్నారంటే అక్రమంగా విక్రయించే వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారనే కదా అర్థం? ఈ వాస్తవాలనెందుకు రాయరు రామోజీరావు గారూ? ప్రభుత్వంపై బురద జల్లేటపుడు ఆ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని కూడా ప్రస్తావించాలి కదా? మీ పాఠకులేం పాపం చేశారు?
మీ సూత్రం ఇప్పుడు వర్తించదా రామోజీ?
రామోజీరావు సూత్రం ప్రకారం మద్య నిషేధాన్ని అమలు చేయటం ప్రభుత్వాలకు అసాధ్యం. నిషేధమే కాదు... మద్యాన్ని నియంత్రించటం కూడా సాధ్యం కాదు. ఎవరికి వారు మద్యం మానేయాలి తప్ప... వారి చేత మద్యం మాన్పించటం ప్రభుత్వాలతో అయ్యే పనికాదు. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచీ రామోజీరావు ఈ సూత్రానికే కట్టుబడ్డారు. 2004లో దిగిపోయి... మళ్లీ చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే వైఖరి.
అందుకే బెల్టు షాపుల జోలికి వెళ్లలేదు. మద్యం దుకాణాలన్నీ ప్రయివేటు మాఫియా చేజిక్కించుకుని ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్నా పెన్నెత్తలేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే ఎమ్మార్పీ ధరలకు ఖచ్చితంగా కట్టుబడి విక్రయిస్తున్నా... బెల్టు షాపుల్ని నామరూపాల్లేకుండా చేసినా ఆయనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒకటీ రెండు చోట్ల చిన్న దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారని, దీన్ని ప్రభుత్వం నియంత్రించటం లేదు కాబట్టి... రాష్ట్రమంతటా ‘3 పెగ్గులు– 6 గ్లాసుల’ మాదిరి ఉందని బురద జల్లేశారు.
మరి రామోజీ లాజిక్ ప్రకారమే చూసుకుంటే వీటిని ప్రభుత్వమెలా నియంత్రిస్తుందని ఆయన అనుకోవాలి కదా? ఎవరికి వారు మద్యం మానాలి తప్ప ప్రభుత్వం వారిచేత ఎలా మాన్పిస్తుందని చెప్పింది ఆయనే కదా? కాకపోతే ఈ ప్రభుత్వ వైఖరి చంద్రబాబులా లేదు. కఠినంగా నియంత్రించడానికే ఎస్‌ఈబీని ఏర్పాటు చేసింది. ఎస్‌ఈబీ దాడులు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిగో... ఇప్పుడు ‘ఈనాడు’ రాసిన వ్యవహారంపై కూడా కచ్చితంగా ఎస్‌ఈబీ తనిఖీలు చేసి తన బాధ్యత తాను నిర్వహిస్తుంది.
కాకపోతే ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ దుర్మార్గపు రాతలు రాయటమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ‘‘బాబు కళ్లలో సంతోషం కోసం’’ అన్న రీతిలో టైమ్ టేబుల్ పెట్టుకుని మరీ ప్రతి పక్షం రోజులకోసారి ఇలా మద్యంపై విషపు రాతలు రాస్తున్న రామోజీకి... ఇది ‘ఈనాడు’ చెబితే నమ్మేసే కాలం కాదని అర్థమయ్యేదెప్పుడో..?
Comments
Please login to add a commentAdd a comment