
బద్వేలు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ డెయిరీ కోసమే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నదని విజయా డెయిరీ చైర్మన్ ఎస్.వి.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఈనాడు దినపత్రికలో ‘సర్వం అమూల్ పాలు’ అంటూ మంగళవారం ప్రచురించిన కథనంపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 సహకార డైరీలను చంద్రబాబునాయుడు తన హెరిటేజ్ సంస్థ కోసం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పాడిరైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కో–ఆపరేటివ్ సంస్థ అయిన అమూల్‌ను రాష్ట్రానికి తీసుకురావడంతో పాడిరైతులకు ఇప్పటి వరకు రూ.2 వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. అయినా ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించడం సిగ్గుచేటని చెప్పారు.
అభివృద్ధి దిశగా విజయా డెయిరీ..
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఖరితో నష్టాల్లో కూరుకుపోయిన విజయా డెయిరీని సీఎం జగన్ ఆదేశాలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ఆ డెయిరీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెలకు రూ.5 లక్షలు లోపు ఆదాయం ఉన్న డెయిరీని నేడు కోటి రూపాయల ఆదాయం వచ్చేలా చేశామని, ఇందుకు ప్రభుత్వ సహకారం ఎంతగానో ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు మేలు జరిగిందా, ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిందా అన్న విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావులు కాణిపాకం వినాయకుని సన్నిధిలో గానీ, తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గానీ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment