బెస్తవేములలో ఏసీసీ పొలాలను పరిశీలిస్తున్న ఆర్డీఓ శ్రీనివాసులు
మైలవరం (జమ్మలమడుగు రూరల్): అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండుకళ్లుగా జనరంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ఏదో ఒకరకంగా రోజూ బురద చల్లాలనే కార్యక్రమానికి పూనుకున్న ఈనాడు పత్రిక.. వాస్తవాలను మరుగుపరిచి వార్తలు వండివారుస్తోంది. వైఎస్సార్ జిల్లాలో రైతులకు పంటల బీమా అందటం పైనా పరిహారం.. పరిహాసం! పేరిట ఒక కథనాన్ని వండింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉన్న ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోవడమే తప్పన్నట్లుగా అచ్చేసింది.
సాగుచేస్తే.. ఈ–క్రాప్ నమోదు
ఈ–క్రాప్ నమోదుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) ఉంది. దీని ప్రకారం రైతు తనకు చెందిన పొలం కాకపోయినా.. అది ఎలాంటి పొలమైనా అందులో పంట వేస్తే చాలు వాటిని ఈ–క్రాప్ చేయవచ్చు. తద్వారా పంట నష్టపోతే రైతుకు బీమా పరిహారం అందించవచ్చు.
ఏం జరిగిందంటే..
మైలవరం మండలంలోని ఆరు గ్రామాల్లో ఏసీసీ యాజమాన్యం గతంలో మూడువేల ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఏసీసీ యాజమాన్యం ఇక్కడ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మించకపోవడంతో అందులో 2,700 ఎకరాల భూమిని గత పదేళ్లుగా స్థానిక రైతులే సాగుచేసుకుంటున్నారు. 14 సర్వే నంబర్లలోని 54.26 ఎకరాల్లో ఆరుగురు రైతులు 2021 ఖరీఫ్‌లో పత్తి, వేరుశనగ పంటలు సాగుచేశారు. బెస్తవేముల సచివాలయంలోని హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ–క్రాప్ చేశారు.
ఈ 54.26 ఎకరాలకు దాదాపు రూ.10 లక్షల పంటల బీమా మంజూరైంది. అన్నదాతల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. రైతులకు పరిహారం ఇవ్వడమే తప్పన్నట్లుగా ఈనాడు శివాలెత్తింది. అక్రమాలు జరిగిపోతున్నాయంటూ కథనం రాసేసింది. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు. అక్కడ పంటలు వేసింది నిజమేనని, ఆమేరకు ఈ–క్రాప్ చేశారని నిర్ధారించి కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఇదిలా ఉండగా.. కలెక్టర్ నిర్ణయం మేరకు ఈ రైతులకు బీమా పరిహారం అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment