Fact Check: Eenadu False Propaganda On Electricity In AP | Ramoji rao - Sakshi
Sakshi News home page

Fact Check: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’

Published Wed, May 11 2022 7:46 AM | Last Updated on Wed, May 11 2022 12:10 PM

Eenadu False Propaganda On Electricity In AP - Sakshi

చంద్రబాబు నాయుడి హయాంలో కరెంటు స్థితిగతులపై అప్పట్లో ‘ఈనాడు’ ఓ వార్త రాసింది. ‘‘మిగులు విద్యుత్తే అసలు సమస్య’’ అనేది దాని శీర్షిక. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్తులో  కొంత మిగిలిపోతోందని.. దాన్ని బయట విక్రయిస్తే ఇక్కడ ఉత్పత్తి చేసిన ధరలో సగం కూడా రావటం లేదన్నది ఆ వార్త సారాంశం. కాబట్టి దాన్ని అమ్మకుండా వదిలేయటమే మంచిదని సూత్రీకరించారు రామోజీరావు!!.

ఇక అసలు సంగతి చూద్దాం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే తనకు కావాల్సిన పవన, సౌర విద్యుత్తు సంస్థలను ఎంచుకున్నారు. పాతికేళ్ల సుదీర్ఘకాలం పాటు ఏకంగా 8వేల మెగావాట్లు కొంటామంటూ ఎడాపెడా ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నారు. అదీ యూనిట్‌కు గరిష్ఠంగా రూ.6.45 పెట్టి మరీ!!. నిజానికి అప్పట్లో అంత కరెంటు అవసరం లేదు. పైపెచ్చు కొన్నేళ్లలో సౌర, పవన విద్యుత్‌ చార్జీలు భారీగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. వాటన్నిటినీ తోసిరాజని.. కమీషన్ల కోసం పాతికేళ్ల బండను తగిలించారు చంద్రబాబు.
చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా?

సరే!! వాళ్లతో ఒప్పందం చేసుకున్నారు కనక... ఆ కరెంటు వాడినా, వాడకున్నా పాతికేళ్లు  వాళ్లకు చార్జీలు చెల్లించకతప్పదు. 2017–18లో రాష్ట్రంలో ఉత్పత్తయినది, ఒప్పందం ప్రకారం కొంటున్నది కలిసి రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిపోయింది. అలా మిగిలిన విద్యుత్తును బయట అమ్మాలంటే... బయట యూనిట్‌ రూ.2కే దొరుకుతోంది. 6 రూపాయలకు కొనే కరెంటును యూనిట్‌ రూ.2కు అమ్మితే నష్టం వస్తుంది కనక... అమ్మకుండా వదిలేయటమే మంచిదనేది ‘ఈనాడు’ వార్త ఉద్దేశం.

అసలు బయట రూ.2కే దొరుకుతున్నప్పుడు ఇక్కడ రూ.5–రూ.6 పెట్టి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబును కాలర్‌ పట్టుకుని నిలదీయొద్దా? రాష్ట్రావసరాలు సరిగా అంచనా వేయకుండా, భవిష్యత్‌లో తగ్గుతాయన్న సూచనలు పట్టించుకోకుండా పాతికేళ్లపాటు మోయలేని బండను తగిలించిన బాబును ఎడాపెడా వాయించొద్దా? అవన్నీ వదిలేసి ‘ఈనాడు’ రాసిన వార్తే... ‘‘మిగులు విద్యుత్తే అసలు సమస్య’’ అని. నిజానికిక్కడ చంద్రబాబే అసలు సమస్య.

తప్పు చేసినా తనను విజనరీ అంటూ మోసే ‘ఈనాడు’.. దాని అధిపతి రామోజీరావే అసలైన  సమస్య. ఏం రామోజీ? ఇదే పరిస్థితి ఏ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోనో తలెత్తితే ఇలాగే రాస్తారా? లేనివి రెండు జోడించి మరీ రాష్ట్రాన్ని తగలెట్టేస్తున్నారని గగ్గోలు పెట్టరా? ఇంత దారుణమైన విషంగక్కుతూ ఏం సాధించాలని? ‘సామాన్యుడికి షాక్‌’ అంటూ విద్యుత్తు చార్జీలపై అచ్చేసిన వార్తలో వాస్తవాలెక్కడ? చంద్రబాబు చేసిన ఘోరాలను వీసమాత్రమైనా ప్రస్తావించరేం? ఐదేళ్లలో విద్యుత్తు సంస్థలపై అక్షరాలా నలభైవేల కోట్ల బకాయిలు మోపిన చంద్రబాబు, ఆయన్ను ఆకాశానికెత్తేసే మీరు ఎంత గొప్ప విజనరీలో జనానికి తెలియదా?

అప్పట్లో సామాన్యులపై 41.04 శాతం భారం
ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను స్వల్పంగా పెంచిన మాట వాస్తవమే. దాన్నెవరూ కాదనరు. కానీ చంద్రబాబు హయాంలో అసలు చార్జీలే పెరగనట్లు... సామాన్యులపై తీవ్ర భారం మోపేశారంటూ ‘ఈనాడు’ రాయటమే దారుణం. ఎందుకంటే 2015–16లో 76 యూనిట్లు వాడితే రూ.140.10 బిల్లు వచ్చేది. దాన్ని చంద్రబాబు 2018–19లో ఏ స్థాయిలో పెంచారంటే... అదే వాడకానికి రూ.197.60 చెల్లించాల్సి వచ్చింది. అంటే 41.04 శాతం మేర పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. అప్పట్లో దాన్నసలు చార్జీల పెంపుగానే పరిగణించని రామోజీరావు... ఇప్పుడు 37.65 శాతం బిల్లు పెరిగిందంటూ గుండెలు బాదుకోవటాన్ని ఏమనుకోవాలి? 80 యూనిట్లలోపు కరెంటు వాడేవారు అప్పట్లో సామాన్యుల్లా అనిపించలేదా? ఇది ఏ మార్కు జర్నలిజం??

రాష్ట్రంలోనే తక్కువ...
తాజాగా తెలంగాణలో రూ.5,600 కోట్లు మేర విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై వేయగా ఏపీలో రూ.1,400 కోట్లకే పరిమితమయ్యారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే 100 యూనిట్లలోపు వాడేవారికి చార్జీలు ఏపీలోనే తక్కువ. ఇక్కడ 100 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.3.11 చార్జీ పడితే... కర్ణాటక, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్‌ వంటి అనేక రాష్ట్రాల్లో ఇది కనిష్టంగా రూ.6.10 నుంచి గరిష్ఠంగా రూ.8.26 వరకూ ఉంది. ఈ వాస్తవాలను ‘ఈనాడు’ ఏనాడూ రాయదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ధరలెక్కువ ఉన్నాయంటూ పుంఖానుపుంఖాలు రాస్తారు తప్ప... వాస్తవంగా విద్యుత్‌ చార్జీల వంటివి ఎంత ఉన్నాయనేది చెప్పరు. అదే చంద్రబాబు సహిత రామోజీమార్కు పాత్రికేయం మరి!.

టెలిస్కోపిక్‌తో మేలు కాదా?
గత ప్రభుత్వ హయాంలో శ్లాబుల విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు టెలిస్కోపిక్‌ విధానాన్ని తెచ్చారు. గతంలో మొత్తం వినియోగానికి ఒకే శ్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు నెలకు 250 యూనిట్లు వాడేవారు.. తొలి 30 యూనిట్లకు యూనిట్‌ రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌ రూ.4.50, అనంతరం 100 యూనిట్లు యూనిట్‌ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్‌ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాలి. గతంలో టారిఫ్‌ మారితే దిమ్మదిరిగేలా షాక్‌ కొట్టేదన్న విషయం రాజగురువుకు గుర్తులేదేమో!!

అప్పటికీ ఇప్పటికీ తేడా ఇదీ...
చంద్రబాబు పీపీఏల వల్ల డిస్కమ్‌లు ఏడాదికి రూ.3వేల కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఇప్పటికి  ఆ నష్టాల విలువ రూ.35,000 కోట్లు దాటింది. అందుకే బాబు హయాంలో రాష్ట్ర డిస్కమ్‌ల నెట్‌వర్త్‌ తుడిచిపెట్టుకుపోయి ఏకంగా రూ.4,315.72 కోట్ల మైనస్‌లోకి జారాయి. దీనికి విరుద్ధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయానికి నిరాటంకంగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌తో (సెకీ) ఒప్పందం చేసుకుంది. ఇది కూడా యూనిట్‌ రూ.2.49కి. అంటే బాబు కొనుగోలు ధరలో సగానికన్నా తక్కువ. ఫలితంగా డిస్కమ్‌లకు ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతోంది. కాకపోతే దీనికీ వక్రభాష్యం చెప్పడానికి రామోజీరావు నానా తంటాలూ పడుతూనే ఉండటం పాత్రికేయ దుస్థితికి పరాకాష్ట.

‘ఈనాడు’ చెప్పని మరికొన్ని వాస్తవాలివిగో..
బాబు ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్తుపై రూ.13,255 కోట్లు రాయితీలివ్వగా ప్రస్తుత ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.21,497 కోట్లు సబ్సిడీ విడుదల చేసింది. విద్యుత్‌  సంస్థలకు రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. 
2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.4925 కోట్లు  ఆదా కాగా, దీనిలో రూ.3373 కోట్లను వినియోగదారులకే ఇచ్చారు. 
దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 52 శాతం వాటా థర్మల్‌దే. కొన్నాళ్లుగా బొగ్గు సరఫరా సరిగా లేదు. మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందని కేంద్రమే చెప్పింది. కనీసం 10 శాతం బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కూడా. కానీ రష్యా–ఉక్రెయిన్‌ పరిస్థితుల వల్ల ధర విపరీతంగా పెరిగింది. గతంలో టన్ను బొగ్గు రూ.7 వేలుంటే ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ పలుకుతోంది. 
రాష్ట్రంలో బొగ్గు గనులు లేవు. మహానది కోల్‌ ఫీల్డ్స్, 
సింగరేణి కాలరీస్‌ నుంచి తెస్తున్నాం.  కేవలం రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా వస్తున్న బొగ్గు రేట్లు,  రవాణా చార్జీలు పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం  14 శాతం పెరిగింది.
కొనుగోలు వ్యయం బాగా పెరగటంతో మార్చిలో రూ.1123.74 కోట్లతో 1268.69 మిలియన్‌ యూనిట్లను, ఏప్రిల్‌లో రూ.1022.42 కోట్లతో 1047.78 మిలియన్‌ యూనిట్లను  కొన్నారు. ఇవన్నీ ‘ఈనాడు’ ఎన్నటికీ చెప్పదు మరి!!.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement