Eenadu False Propaganda On AP Roads | Ramoji Rao - Sakshi
Sakshi News home page

ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా?

Published Tue, May 10 2022 9:55 AM | Last Updated on Tue, May 10 2022 10:55 AM

Eenadu False Propaganda On AP Roads - Sakshi

చంద్రబాబు నాయుడి హయాంలో పల్లె రోడ్లన్నీ అద్దాల్లా మెరిసిపోయాయి. నల్లటి తాచుపాముల్లా బుసలు కొట్టాయి. కాబట్టే... ‘ఈనాడు’ ఏనాడూ ఆ రోడ్ల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. రామోజీరావు కూడా ఆ రోడ్లను చూసి మురిసిపోయారే తప్ప ఒక్కనాడూ తన సిబ్బందిని పంపించి రోడ్లెలా ఉన్నాయో చూసి... వార్త రాయమనలేదు. కాకపోతే... ‘వీటిని రోడ్లంటారా?’ అని తాటికాయంత అక్షరాలతో సోమవారం అచ్చేసిన కథనంలోనే రామోజీ ఓ నిజాన్ని ఒప్పుకున్నారు. 2019లో ఎన్నికల సమయంలో కంకర తేలి దారుణంగా ఉన్న ఓ రోడ్డును అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ బాగు చేయిస్తానన్నారని, తాను గెలిచినా ఇప్పటికీ చేయించలేదని కూడా రాశారు. అంటే... చంద్రబాబు నాయుడి ఐదేళ్ల జమానాలో ఆ రోడ్డు అలానే ఉందని తానే అంగీకరించారు.

మరి ఆ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా రాష్ట్రంలో రహ‘దారుణాల’ గురించి రాయలేదెందుకురామోజీ? చంద్రబాబు అధికారంలో ఉంటే ఆ గుంతలు కనపడకుండా మీ కళ్లకు గంతలు కట్టుకుంటారా? ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి గంతలు తీసేసి చూస్తున్నారా? ఎందుకింతటి విషపు రాతలు? రోడ్లనేది నిరంతర ప్రక్రియని.. ఎక్కడో చోట రోడ్లు వేయటం... మళ్లీ కొన్ని దెబ్బతినటం జరుగుతూనే ఉంటుందని తెలియదా? ఆరేడు రోడ్లు తీసుకుని దాన్ని రాష్ట్రమంతటికీ వర్తింపజే సి ఈ తరహా రాతలు రాయటం ఏ మార్కు పాత్రికేయం? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఏది నిజం? ఇదిగో చూద్దాం....

రామోజీ పంపించిన ‘ఈనాడు’ బృందం రాష్ట్రంలో చూసినవన్నీ పల్లె రోడ్లే. అంటే పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిధిలోనివి. రాష్ట్రంలో మొత్తంగా పంచాయతీరాజ్‌ పరిధిలో 26,450 కిలో  మీటర్ల పొడవున తారు రోడ్లున్నాయి. కాకపోతే వాటిలో సగానికి పైగా రోడ్లు... అంటే 13,801 కిలో మీటర్ల మేర రోడ్లు 2018 ఏప్రిల్‌ నాటికే దారుణంగా దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలని, ఆ రోడ్లపై కొత్త తారు లేయర్‌  వేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంకో నెలరోజుల్లో ఎన్నికలు పెట్టుకుని .. 2019 జనవరి 11వ తేదీన జీవో నంబరు 34 జారీ చేసింది. ఒక్క కిలోమీటరూ వేయకుండానే దిగిపోయింది. అదీ.. రామోజీ మిత్రుడు చంద్రబాబు చిత్తశుద్ధి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషమేంటంటే... అప్పట్లో పంచాయతీ రాజ్‌ మంత్రి సాక్షాత్తూ చిన నారావారే!!.

ఇక ఇప్పుడు చూస్తే... రాష్ట్రంలో 9,122 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతిన్నట్టు పంచాయతీరాజ్‌ అధికారులు నిర్ధారించారు. అంటే... అప్పట్లో దెబ్బతిన్న  రోడ్లు  ఈ మూడేళ్లలో బాగు చేసినట్లే కదా?  ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు రామోజీ? దీనికి తోడు అక్కడక్కడా గుంతలు ఉండేవి పోను... ఈ 9,122 కిలో మీటర్ల రోడ్లలో 5,260 కిలోమీటర్ల పొడవు రోడ్లపై కొత్త తారు లేయరు వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. ఆ 5,260లో... రోడ్లు బాగుండి కేవలం గుంతలు పూడ్చాల్సినవి 899 కిలోమీటర్లు. ప్రభుత్వం అనుమతులివ్వటంతో ఈ పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా మొదలయింది. ఇవీ... రామోజీ రాయటానికిష్టపడని నిజాలు.


మెరుగుపడినట్లా? లేక దెబ్బతిన్నట్లా?
గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోడ్లను బాగు చేసూ్తనే వస్తోంది. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రోడ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిరోడ్డూ అధ్వాన్నంగా తయారైంది. దీంతో వాటిని బాగు చేయడానికిçప్పుడు మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే బాబు పాలనలో ఐదేళ్లూ రోడ్లను పట్టించుకోకున్నా రామోజీ ఒక్క వార్త రాయలేదు. ఒక్క ఫొటో వేయలేదు. పైపెచ్చు ఈ మూడేళ్లలో ఎక్కడికక్కడ రోడ్లను బాగు చేసి అధికారులు... నాడు– నేడు పేరిట ప్రజెంటేషన్‌ కూడా తయారు చేశారు. అలాంటి ఫొటోలు కూడా ‘ఈనాడు’లో వస్తే ఒట్టు!!. అంటే... రామోజీకి కావలసింది వైఎస్‌ జగన్‌ ప్రజాభిమానాన్ని దెబ్బతీయటం. ఓ సమస్యకు వంద అబద్దాలు కలిపి మరీ వీలైనంత వ్యతిరేకతను పోగు చేయటం. ఇంకెన్నాళ్లీ దొంగాట రామోజీ?

రూ.1,072 కోట్లతో మరమ్మతులకు జీవో
పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న రోడ్లు పోను మిగిలిన వాటిక్కూడా రూ.1,072.72 కోట్లతో పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 5న జీవో మంజూరు చేసింది. ఈ నిధులతో  2,421.14 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లకు ఒక లేయర్‌ కంకర, మరో లేయర్‌ తారు వేస్తారు. మరో 1,948.5 కి.మీ. మేర పూర్తిగా తారు లేయర్‌... ఇంకో 898.92 కి.మీ. మేర గుంతలు పూడ్చడం చేపడతారు. వీటికోసం పంచాయతీరాజ్‌ అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలెట్టారు కూడా.

నిధులివ్వకుండా బాబు హడావుడి... 
2018 ఏప్రిల్‌ నాటికే 13,801 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పినా... నాటి బాబు సర్కారు పట్టించుకుంటే ఒట్టు. చివరకు నిధులివ్వకుండానే ఎన్నికలకు నెల ముందు హడావుడిగా జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది. అప్పట్లో రూ. 1,500 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుని 9 జిల్లాల్లో రోడ్లు మరమ్మతు చేపడతామని జీవో ఇచ్చినా... రుణానికి బ్యాంకులు నో చెప్పటంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కాకపోతే చంద్రబాబు చేసిన ఈ దారుణాల్ని రామోజీ ఎప్పుడూ తన మీడియాలో చెప్పరు.

రోడ్ల మర్మమతులకు ‘ఉపాధి’ నిధులిస్తారా?
తనది కాకుంటే ఏమైనా చెప్పొచ్చనేది ‘ఈనాడు’ పద్ధతి. రోడ్లకు ఉపాధి హామీ నిధులు ఖర్చు పెట్టలేదని, భవనాలపై పెట్టేశారని తెగ ఆక్రోశించింది. కానీ ఎప్పుడో వేసిన రోడ్లకు మరమ్మతులు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకంలో అవకాశమే ఉండదు. ఈ పథకంలోని మెటీరియల్‌ నిధులతో కొత్తగా కంకర రోడ్డు లేదంటే బీటీ రోడ్డు వేయొచ్చు. ఈ విషయం తెలిసి కూడా జనంలో వ్యతిరేకతను పెంచడానికి విషం గక్కారో... లేక అజ్ఞానంతో అలా ఆక్రందనలు చేశారో రామోజీకే తెలియాలి. పైపెచ్చు ఉపాధి నిధులతో రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాల వంటివి నిర్మించడం నేరమనే రీతిలో రాతలు రాయటం ఏ రకం జర్నలిజమో ‘ఈనాడు’కే తెలియాలి!!.  

పూర్తయినవి 3,705 కి.మీ.. పురోగతిలో మరో 6,113 కి.మీ.
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత మూడేళ్లలో 3,705 కిలోమీటర్ల పొడవున కొత్తగా తారు రోడ్లు వేశారు. వాటి వివరాలివీ...
60–40 నిష్పత్తిన కేంద్ర రాష్ట్రాల నిధులతో రూ.989 కోట్లతో  1741 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రెండు మూడు లేయర్ల తారు రోడ్లు... మరో 410 కిలో మీటర్ల సింగిల్‌ లేయర్‌ తారు రోడ్లు నిర్మించారు. 
ఏపీ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్టు కార్యక్రమంలో ఇంకొక 1,147 కి.మీ. మేర తారు రోడ్ల నిర్మాణం చేపట్టారు. నాబార్డు నిధులతో మరో 407 కి.మీ. మేర తారు రోడ్లు వేశారు. 
ఇప్పటికే పూర్తయినవి కాకుండా పీఎంజీఎస్‌వై పథకం ద్వారా మరో 2160 కి.మీ. ఏపీ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్టులో ఇంకొక 3,953 కి.మీ. రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అంటే.. 6,113 కి.మీ. మేర రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పీఎంజీఎస్‌వై కింద కొత్తగా 1317 కి.మీ. రోడ్లు మంజూరు చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలోనే 3047 కి.మీ. మేర రోడ్లు మంజూరు చేసింది కాకపోతే... ఈ నిజాలు ‘ఈనాడు’ ఏనాడూ రాయదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement