సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు పైత్యం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలో రోడ్లపై పదే పదే కట్టుకథలను కొత్తగా వండివారుస్తున్నాడు. రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నా సరే... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ గుంతల పేరిట కొత్త కథ వినిపించారు.
చంద్రబాబుకు రాజకీయంగా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆక్రోషం కట్టలు తెంచుకుని రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతూ దిగజారుడు పాత్రికేయం చేస్తున్నారు. పాత ఘటనలకు కొత్తగా రంగులద్దుతూ బాబుకు మేలు చేసేందుకు జాకీ లెత్తుతున్నారు.
రాష్ట్రంలో 99 శాతం బాగున్న రోడ్లను చూడకుండా.. రంధ్రాన్వేషణకు పాల్పడుతూ ఎక్కడో ఒక చోట రోడ్డు కాస్త దెబ్బతిన్న ఫొటోలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.42,236.28 కోట్లు వెచ్చించారు. ‘పచ్చ’ కామెర్లు కమ్మేసిన రామోజీ కళ్లకు ఈ నిజం ఎందుకు కనిపించలేదన్నది ఎవరికి తెలియదు?. బాబు పాలనలో 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు.
దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతులకు కేవలం రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం( 2023–24) తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది. రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది.
ఈనాడు దుష్ప్రచారం: పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన బత్తిన ఆనంద్ గతేడాది అక్టోబర్ 20న పిడుగురాళ్ల మండలం జూలకల్లు అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించాడు.
వాస్తవం: ఆ రోడ్డుపై ఎలాంటి గుంతలు లేవు. రైతులు తమ పొలాలకు నీటి కోసం రోడ్డు తవ్వి మట్టితో పూడ్చారు. అదే సమయంలో ఆనంద్ భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం ఇంటి నుంచి నగదు తీసుకొని వేగంగా వెళ్తూ అక్కడికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం ఢీకొనలేదు. ఈనాడులో రాసినట్టుగా ఆయన భార్య బైక్‌పై లేదు. వెంటనే ఆర్ అండ్ బీ అ«ధికారులు రోడ్డు తవ్విన రైతులతోనే తారు వేసి మరమ్మతులు చేయించారు.
ఈనాడు దుష్ప్రచారం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన తోటాడ సింహాచలం 2021 జనవరి 4న మాకివలస– కిల్లాం రోడ్డుపై గుంత వల్ల ప్రమాదానికి గురై మరణించాడు.
వాస్తవం: సింహాచలం మాకివలసకు మోపెడ్‌పై మద్యం మత్తులో వస్తూ ఒక మలుపు వద్ద అదుపు తప్పి మట్టి రోడ్డుపై నుంచి పొలాల్లో పడిపోయాడు. గాయపడిన సింహాచలంను కిళ్లాంకు చెందిన యాగేటి రమణ, నీలయ్యలు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. సింహాచలం మృతికి గుంతలు కారణమనడం సరికాదని నీలయ్య పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన స్థలంలో అసలు గుంతలే లేవు.
ఈనాడు దుష్ప్రచారం: కర్నూలు నగరంలోని మద్దూర్‌నగర్‌కు చెందిన నర్సయ్య గతేడాది జూలై 29న లక్ష్మీనగర్‌లో ఉన్న గుంతలో పడి గాయపడ్డాడని, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని రాశారు.
వాస్తవం: మద్దూర్‌నగర్‌లో వార్డు పరిధిలో విశాలమైన సీసీ రోడ్లు ఉన్నాయి. నర్సయ్య వెళ్లే దారిలో కుళాయి కోసం గుంత తవ్వి వదిలేశారు. రోజూ వెళ్లే మార్గమే అయినా.. కుళాయి కోసం తవ్విన గుంత గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. అంతేకాని రోడ్లపై ఎలాంటి గుంతలు లేవు.
ఈనాడు దుష్ప్రచారం: 2022 ఆగస్టు 4న అల్లిపురం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో ఫ్లై ఓవర్ వద్ద గుంతలో పడి సుబ్బారావు మృతిచెందాడు.
వాస్తవం: ఆ నెలలో కురిసిన భారీ వర్షాలకు అల్లిపురం–విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డుపై చిన్నపాటి గుంత పడింది. అక్కడ ఉన్న మర్రిచెట్టు కొమ్మల కారణంగా వీధిలైట్లు ఉన్నప్పటికీ వెలుతురు సరిగా లేదు. గుంతను దాటుకుంటూ ఎంతో మంది ప్రయాణించారని.. ఒక ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వెళ్లడంతో అక్కడ అదుపుతప్పి పడిపోయి తలకు గాయమై ఉండొచ్చని, లేదా మరేదైనా కారణం కావచ్చని సంబంధిత ఏఈ తెలిపారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఈనాడు పత్రిక గుంతవల్లేనంటూ వార్త రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment