Eenadu News Paper False Propaganda On Sand Mining In AP - Sakshi
Sakshi News home page

ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ?

Published Sun, May 15 2022 7:46 AM | Last Updated on Sun, May 15 2022 3:06 PM

Eenadu News Paper False Propaganda On Sand Mining In AP - Sakshi

టీడీపీ హయాంలో చంద్రబాబు నివాసం సమీపంలోని పెనుమాక నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్న లారీలు

రామోజీరావుకు మండుతోంది. రావాల్సిన వాటాలు రావటం లేదన్న మంట!!. ఐదేళ్ల పాటు రాత్రీపగలూ తేడాలేకుండా యథేచ్ఛగా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ఇసుక సొమ్ము.. మూడేళ్లుగా దారి తప్పి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే పోతోందన్న మంట!!. ఇకపై తన ’బాబు’ గెలిచే అవకాశం లేదన్న మంట!!. తమ విషప్రచారాన్ని  జనం మునుపట్లా నమ్మటం లేదన్న మంట!!. అందుకే శివాలెత్తిపోతున్నారు.
చదవండి: వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రతి రోజూ పతాక శీర్షికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడి...  వీలైనంత  విషం చిమ్ముతున్నారు. శనివారం వండి వార్చిన ‘చెన్నై సంస్థ గుప్పిట్లోనే ఇసుక’ కథనం కూడా అలాంటిదే!!. ఆరు నెలల కిందట రాసిన ఇదే కథనాన్ని.. మళ్లీ ఓసారి బూజు దులిపి అచ్చు వేసేశారు. నిజాలకు పూర్తిగా పాతర వేసేసి... అడుగడుగునా జనంలో అనుమానాలు రేకెత్తేలా విషం గక్కిన ఈ కథనంలో... నిజానిజాలేంటో చెప్పే ప్రయత్నమే ఇది..

అబద్ధాలను అందంగా పేర్చడంలో ‘ఈనాడు’ది అందెవేసిన చేయి. ఎందుకంటే టెండర్ల ప్రక్రియ గురించి కానీ... సబ్‌ కాంట్రాక్టర్ల గురించి కానీ... ఆ కాంట్రాక్టర్లు పెట్టుకునే సిబ్బంది గురించి కానీ రామోజీకి తెలియనిదేమీ కాదు. కాకపోతే జనం తను ఏది చెబితే అది నమ్ముతారన్న భ్రమలో ఈ తరహా రాతలు రాస్తుంటారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ ఇసుక ఉచితమే అని రామోజీ పదేపదే రాస్తారు తప్ప... ఆ ఉచితం ప్రజలకు కాదని, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు నేతలకే అని చెప్పరు.

దొంగల ముఠాగా ఏర్పడ్డ దుష్ట చతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఐదేళ్లు రాత్రీపగలూ యథేచ్ఛగా నదులూ, వాగులూ ఊడ్చేశారని చెప్పనే చెప్పరు. ఈ ఇసుక దోపిడీ ఏ స్థాయిలో సాగిందంటే... ఆఖరికి చినబాబు, పెదబాబు కనుసన్నల్లో కరకట్ట ఇంటివెనక తిరిగిన లారీల దెబ్బకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ కన్నెర్ర చేసింది. నాటి ప్రభుత్వంపై ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదీ... రామోజీరావు చెప్పని అసలు కథ.

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో కృష్ణానదిలో ఏకంగా రిగ్‌ ఏర్పాటు చేసి మరీ నదిగర్భాన్ని తవ్వేశారు.. చంద్రబాబు హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ జరిగిందనేందుకు ఇవే నిదర్శనాలు.. 

అడ్డుకున్న ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని...
అంతేకాదు!. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్‌. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. చింతమనేనిపై కేసు పెట్టడానికి కూడా మనసొప్పలేదు నారా వారికి. ఒక మహిళా అధికారికి అంతటి అన్యాయం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పెన్నెత్తి ఒక్క అక్షరమైనా రాయలేకపోయింది ‘ఈనాడు’. పైపెచ్చు చంద్రబాబు నాయుడి హయాంలో ఇసుక ఉచితం... అంటూ ఇప్పటికీ వండి వారుస్తుంటుంది. అదీ... రామోజీ మార్కు రాజకీయమంటే!!.

టెండర్లలో మీరెందుకు పాల్గొనలేదు రామోజీ? 
నిజానికి బాబు హయాంలో ఐదేళ్లూ జరిగిన లూటీని చూశాకే ఈ విషయంలో పారదర్శకమైన విధానం తేవాలని భావించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఉచితం అనే పేరుతో జనానికి విక్రయించిన రేటుకన్నా కాస్త తక్కువ ధరకే దొరికేలా... నేరుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతే విక్రయాలు జరిపించారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇలానే జరగ్గా... ఆ పద్ధతీ ‘ఈనాడు’కు నచ్చలేదు. కొన్నాళ్లు ఇసుక దొరకటం లేదంటూ... కొన్నాళ్లు లెక్కలు సరిగా లేవంటూ చేతికొచ్చిన రాతలు రాస్తూనే వచ్చింది. వీలైనంత విషం చిమ్ముతూనే వచ్చారు రామోజీ!!.

వీటన్నిటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి టెండర్లు పిలిచి ప్రైవేటు వారికే అప్పగించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా రావాలని కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు చేయటంతో ఆ దిశగా కొత్త విధానం తెచ్చింది ప్రభుత్వం. టెండర్లలో ఎలాంటి అవకతవకలూ లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది ప్రభుత్వం. టెండర్లు పిలవటం నుంచి వారి అర్హతలను చూసి... అత్యధికంగా చెల్లిస్తామన్న బిడ్డర్‌ను ఎంపిక చేసే వరకూ అంతా ఎంఎస్‌టీసీయే చూసుకుంది. రాష్ట్రానికి వెలుపలున్న పలు సంస్థలు పాల్గొన్న ఆ టెండర్ల ప్రక్రియలోనే ఉత్తరాదికి చెందిన జేపీ వెంచర్స్‌ విజేతగా నిలిచింది.

నిబంధనలు మీరితే కోల్పోయే షరతుతో రూ. 120 కోట్ల ముందస్తు డిపాజిట్‌ను కూడా చెల్లించింది. ఇవన్నీ వదిలి... ఎక్కడో  హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో, మధ్యప్రదేశ్‌లోని నిగ్రీలో రిజిస్టర్డ్‌ చిరునామాలుండి, ఢిల్లీలో కార్పొరేట్‌ ఆఫీసున్న జేపీ సంస్థ కాంట్రాక్టును దక్కించుకుందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. ఏం? జాతీయ స్థాయి బిడ్లు పిలిచినప్పుడు జాతీయస్థాయి సంస్థలు రావా? మీరెందుకు టెండర్లు వేయలేదు రామోజీ? మీ అర్హతను బట్టి మీకే వచ్చేదేమో? బాబుతో కలిసి ఫ్రీగా లూటీ చేయటం అలవాటైంది కనక టెండర్లు వేయటానికి  మనసొçప్పలేదా? జాతీయ స్థాయిలో టెండర్లు పిలవబట్టే కదా సదరు కాంట్రాక్టు సంస్థ ద్వారా ఇప్పుడు రాష్ట్రానికి పారదర్శకంగా ఏటా రూ.750 కోట్ల రాబడి వస్తోంది. ఐదేళ్లు లెక్కవేస్తే దాదాపు రూ.4 వేల కోట్లు. మరి బాబు హయాంలో ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి పోయింది రామోజీరావు గారూ? మీ ముఠానే లూటీ చేసిందన్న ఆరోపణలకు మీ దగ్గర సమాధానముందా? ఇక చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల ఇసుక దందా గురించి తెలియనిదెవరికి?

సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వకూడదా? దాన్ని అడ్డుకోగలరా?
ఏ కాంట్రాక్టుకయినా ‘కాంట్రాక్టు ధర్మం’ తప్పనిసరి. అంటే!! అప్పగించిన పనిని పూర్తి చేయటం. ఆర్థికాంశాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం. ఇసుక విషయంలోనూ ఇంతే. వాళ్లు ఎంత ఇసుకను తవ్వి జనానికి అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. గరిష్ట విక్రయ ధరను కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ప్రభుత్వానికి ఎంత రాయల్టీ చెల్లించాలన్నది కూడా కాంట్రాక్టు ధర్మంలోనే ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆ కాంట్రాక్టరు పనిచేస్తే చాలు. కానీ వీటికోసం తను ఎవరైనా సబ్‌ కాంట్రాక్టరును ఉపయోగించుకున్నారా, లేక కూలీలను పెట్టుకున్నారా... లేక ఎవరికైనా లీజుకిచ్చారా... ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు.

దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పద్ధతి. చంద్రబాబు కానీ... మరో బాబు కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పద్ధతి. దీన్ని కూడా ‘ఈనాడు’ తప్పు పట్టడమే చిత్రాతిచిత్రం. జేపీ సంస్థ వేరెవరిదో చెన్నై సంస్థకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేసిందని, అన్నిచోట్లా వారే చక్రం తిప్పుతున్నారని రామోజీరావు శివాలెత్తిపోయారు. పైపెచ్చు సదరు సంస్థ తమిళం మాట్లాడే వాళ్లను, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల యాస మాట్లాడేవాళ్లను విధుల్లో ఉపయోగిస్తోందన్నది మరో ఆరోపణ.

ఏం? తెలుగుదేశానికి చెందిన కాంట్రాక్టర్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో పనులు దక్కించుకుని చేయలేదా? వేరొకరి దగ్గర సబ్‌ కాంట్రాక్టులు చేయలేదా? ఆ పనుల్లో తమ వారినే పెట్టుకోలేదా? ఇవన్నీ నియంత్రించగలిగే అంశాలేనా రామోజీ? ఎందుకీ విషపురాతలు? మీ ఫిలిం సిటీలోని అడ్వెంచర్స్, విజువల్‌ గ్రాఫిక్స్‌ వంటి రకరకాల విభాగాల్లో ఉన్నదంతా ఉత్తరాది వారే కదా? వారికి అందులో నైపుణ్యం ఉన్నదనే కదా తెచ్చుకున్నారు? చేసేదొకటి... చెప్పేదొకటి అయితే ఎలా? 

ధరలో పారదర్శకత కనిపించలేదా? 
చంద్రబాబు హయాంలో ఉచితం అని చెప్పినా... వాస్తవ ధర ఇప్పటికన్నా టన్నుకు రూ.50 నుంచి 100 వరకూ ఎక్కువే. అందుకనే కాంట్రాక్టరైన జేపీ వెంచర్స్‌కు ధరకు సంబంధించి ఖచ్చితమైన నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిప్రకారం ప్రతి వారం పత్రికల టాబ్లాయిడ్లలో స్థానికంగా ఇసుక ఎంత ధరకు లభిస్తోందన్నది స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి. దాన్లోని ధరకన్నా ఎక్కువకు విక్రయించకూడదు.  ఒకవేళ అలా విక్రయిస్తే ప్రజలు ‘‘14500’’ నెంబరుకు ఫోన్‌ చేయొచ్చు. ఇసుక, మద్యం అక్రమాల్ని ఏరిపారెయ్యడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) టోల్‌ ఫ్రీ నంబర్‌. ఇలా అక్రమాలకు పాల్పడ్డవారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలనూ తెచ్చింది. మరి అక్రమాలకు తావెక్కడుంది  రామోజీ.. మీ రాతల్లో  తప్ప!!.

ప్రతిరోజూ.. ఓ గోబెల్స్‌ ఘట్టం
ఏమీ జరగకున్నా ఏదో జరిగిపోతోందన్న ప్రచారాన్ని సమర్థంగా అందరిలోకీ పంపి... అదే నిజమని వారంతా నమ్మేలా భ్రమింపజేసేవాడట గోబెల్స్‌. అలాంటి గోబెల్స్‌ ప్రచారంలో... దుష్ట చతుష్టయంగా ముద్ర పడ్డ దొంగముఠా దిట్ట. ప్రతిరోజూ ఓ అంశాన్నెత్తుకుని పతాక శీర్షికల్లో వేయటం ద్వారా గోబెల్స్‌ తొలిఘట్టాన్ని ఆరంభించే బృహత్తర బాధ్యత రామోజీది. దాన్ని మళ్లీ టీడీపీ నాయకులు ప్రస్తావిస్తే.. దాన్ని మిగిలిన దుష్ట చతుష్టయం ఇంకాస్త జనంలోకి తీసుకెళుతుంది. రాష్ట్రంలో ఇసుక లభ్యత లేదని, సబ్‌ కాంట్రాక్టర్లు ధరలు పెంచేస్తున్నారని వస్తున్న ప్రచారమంతా ఇలాంటిదే.

అవసరం ఉండి ఇసుక తీసుకునే వారికి నిజమేంటో తెలుసు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి మరీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు మత్స్యకారుల ఖాతాల్లో వేసిన రూ.109 కోట్ల మత్స్యకార భరోసా కూడా ఇలాంటి కార్యక్రమమే. జగన్‌ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరానికే రూ.109 కోట్లను మత్స్యకారుల ఖాతాల్లో వేయగా... చంద్రబాబు ఐదేళ్లలో వారికి ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. జగన్‌ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏకంగా రూ.418 కోట్లు వారి ఖాతాల్లో వేసింది. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో పెరుగుతున్న ముఖ్యమంత్రి గ్రాఫ్‌ను... ఎలాగో ఒకలా తగ్గించాలన్నది ఈ దుష్ట చతుష్టయం పన్నాగం. అందుకే గోబెల్స్‌ ప్రచారం. అందులో తొలి మెట్టే... ‘ఈనాడు’ కథనాలు.

ఆన్‌లైన్‌పైనా అబద్ధాలేనా? 
950 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే చోట ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఆస్కారం లేకపోవటం ఏమిటన్నది రామోజీరావు ఆక్రోశం. అందుకే ఆయన ప్రధాని మోదీని కూడా ప్రస్తావనలోకి తెచ్చేశారు. డిజిటల్‌ చెల్లింపులను మోదీ ప్రోత్సహిస్తుంటే రాష్ట్రం పట్టించుకోవటం లేదని రాసి పారేశారు. కానీ... ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌లు, చెల్లింపులు వంటివి ఉన్నా అందరికీ అవగాహన లేక చేయటం లేదని కూడా రామోజీయే రాశారు. ఎందుకీ రెండు నాల్కల రాతలు? ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు అక్కడే చెల్లించే అవకాశం ఉండటంతో పాటు... ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతా నంబర్లను ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు, డిపోల వద్ద సైతం జేపీ సంస్థ అందుబాటులో ఉంచింది. నగదు కూడా చెల్లించే అవకాశం ఉంది తప్ప నగదు మాత్రమే చెల్లించాలన్న నిబంధన ‘ఈనాడు’ కల్పితం. అన్నిచోట్లా వే బ్రిడ్జ్‌ లు ఉండటమే కాక ఓవర్‌లోడింగ్‌కూ అవకాశం లేదు. ఇవన్నీ అబద్ధాల వంటకానికి కాస్త మసాలా జోడించే ప్రయత్నాలు. ఇదే రామోజీ మార్కు పాత్రికేయం.

ఇసుక తవ్వకాల్లో అవకతవకల్లేవు
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో ఎక్కడా ఉల్లంఘనలు, అవకతవకలు జరగడంలేదని గనుల శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డబ్ల్యూబీ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో ఇసుక తవ్వకాలు, విక్రయాలపై అవాస్తవాలు ప్రచురించారని తెలిపారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో ఉన్న లోపాలను సవరించి ఇసుక విధానం పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయని, మైనింగ్‌ శాఖతోపాటు ఎస్‌ఈబీ, పోలీసు, రెవెన్యూ శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులున్నట్లు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తున్నామన్నారు.

ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీవారం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నామని, ఏమైనా ఇబ్బందులుంటే ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్‌ నంబర్లు కూడా అందులో ప్రచురిస్తున్నామని ఆయన తెలిపారు. ఇసుక అమ్మకాలకు సంబంధించిన చెల్లింపులను ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ స్వీకరిస్తున్నట్లు చంద్రశేఖర్‌ చెప్పారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి జేపీ సంస్థ ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చి ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు.

జేపీ సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చుకోవచ్చు
ఇక ఇసుక కాంట్రాక్టును జేపీ సంస్థ జాతీయ స్థాయి ఓపెన్‌ బిడ్డింగ్‌లో దక్కించుకుందని, టెండర్ల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిందని తెలిపారు. టెండరు దక్కించుకున్న సంస్థ సబ్‌ కాంట్రాక్టు ఇచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ, తమకు జేపీ సంస్థ మాత్రమే జవాబుదారీ అని, ఏదైనా తాము ఆ సంస్థనే అడుగుతామని తెలిపారు. టర్న్‌కీ సంస్థను సబ్‌ కాంట్రాక్టుగా జేపీ సంస్థ పెట్టుకుందని దాంతో తమకు నేరుగా సంబంధంలేదన్నారు. జేపీ సంస్థ నుంచి రూ.120 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా కట్టించుకున్నామని, నిబంధనల ప్రకారం పనిచేయకపోతే ఆ డబ్బును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు.

అక్రమాల అడ్డుకట్టకు ఎస్‌ఈబీ ఏర్పాటు
ఇక ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిలువరించేందుకు ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసిందని, టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500ని కూడా ప్రజలకు అవగాహన అయ్యేలా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఇసుక ఆపరేషన్స్‌లో ఉల్లంఘనలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు. ఇసుక తవ్వకాలను గనుల శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే వెళ్లి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అన్ని ఇసుక డిపోల్లో వేబ్రిడ్జిలు ఉన్నాయని, రీచ్‌లు కూడా తమకు దగ్గరగా ఉన్న వేబ్రిడ్జిలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు. జేపీ సంస్థ ఇప్పటివరకు 1.70 కోట్ల టన్నుల ఇసుకను తవ్విందని, అందులో కోటి టన్నులను విక్రయించిందని తెలిపారు. మిగిలిన 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసి విక్రయిస్తోందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ రూ.668 కోట్లు చెల్లించిందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement