సాక్షి, అమరావతి : చంద్రబాబు నేతృత్వంలోని గజదొంగల ముఠాలో సభ్యుడైన రామోజీరావుకు ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతిదీ తప్పుగానే కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం ఏం చేసినా అందులో కోడిగుడ్డుపై ఈకలు పీకడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత చంద్రబాబు పాలనలో సాగు నీటి రంగం కుదేలైనప్పటికీ మారుమాట్లాడని ఈ పెద్దమనిషి ఇప్పుడు నీతులు చెబుతున్నారు.
‘నిర్మించకుండా వంచన.. అడ్డగోలుగా అంచనా’ అంటూ మంగళవారం మరోమారు విషం కక్కారు. ఎందుకంటే.. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో..) పద్ధతిలో ప్రభుత్వ ఖజానాను అప్పట్లో దోచుకున్నారు కాబట్టి. ఇప్పుడూ చంద్రబాబు హయాంలో సాగినట్లు సాగుతోందని భ్రమపడి వాస్తవాలను వక్రీకరించారు. ఈ దుష్ప్రచార కథనంలో ఆరోపణలు.. వాస్తవాలు ఇలా ఉన్నాయి.
ఆరోపణ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. సవరించిన అంచనాలతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సాగు, తాగునీటి సౌకర్యం మృగ్యం.
వాస్తవం: సాగునీటి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాధాన్యతా క్రమంలో వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. గతేడాది నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 68 చెరువులను నింపే పథకం పూర్తి చేశారు.
వెలిగొండ మొదటి సొరంగం ఇప్పటికే పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తి కావస్తోంది. వెలిగొండ తొలి దశ దాదాపుగా పూర్తయింది. వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 కూడా పూర్తి కావస్తోంది. పోలవరం, తోటపల్లి బ్యారేజ్, తారకరామతీర్థసాగరం నుంచి హంద్రీ–నీవా వరకు అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.28 వేల కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించారు.
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014 జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు చంద్రబాబు రూ.68,293.34 కోట్లు ఖర్చు చేశారు.
కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. దీన్ని బట్టి చూస్తే అడ్డగోలుగా అంచనాలు పెంచింది.. పనులు చేయకుండా వంచించింది.. బిల్లులు కాజేసింది చంద్రబాబేనన్నది నిజం కాదా రామోజీ?
ఆరోపణ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంచనా వ్యయం 2019లో రూ.2022.20 కోట్లు ఉంటే ఇప్పడు రూ.18,271.31 కోట్లకు.. వెలిగొండ ప్రాజెక్టు అంచనా రూ.5,564.22 కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 8,054.30 కోట్లకు ఇలా ప్రాజెక్టుల అంచనా వ్య యాన్ని రూ.24,827.23 కోట్లకు పెంచేశారు. నిర్మాణాలు చేపట్టడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల అంచనాను రూ.4,909 నుంచి రూ.9,543 కోట్ల కు పెంచుతూ ప్రతిపాదనలు పంపారు.
వాస్తవం: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో రూ.7,214.10 కోట్లతో 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ పథకంలో తొలి దశ కింద 5.8 టీఎంసీలను తరలించే పనులను రూ.2022.20 కోట్లతో 2018లో చంద్రబాబు చేపట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూ.17,050.20 కోట్లతో పనులు చేపట్టడానికి 2022 జూన్ 17న అనుమతి ఇచ్చింది.
భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ వ్యయం, నిర్వాసితుల పునరావాస వ్యయం, 2019 నాటితో పోల్చితే పనుల పరిమాణం పెరిగింది. దీని వల్లే అంచనా వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డిజైన్లను ఇప్పటికే జల వనరుల శాఖ ఆమోదించింది. భూ సేకరణ చేస్తూ వడివడిగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టును 2016, 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తానంటూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతూ వచ్చారు.
సొరంగాల తవ్వకంలో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం)లకు మరమ్మతుల పేరుతో రూ.66 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. వాటిని మింగేశారు. రెండు సొరంగాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. అస్మదీయులకు అప్పగించిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప పనులు చేయలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండను ప్రాధాన్యతగా చేపట్టి.. 2021 జనవరి 13 నాటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తికావొచ్చింది. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు భూసేకరణ చేయాల్సి ఉంది.
డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టాల్సి ఉంది. అందువల్లే వాటి అంచనా వ్యయం పెరిగింది. చింతలపూడి ఎత్తిపోతలను 53.5 టీఎంసీల మేరకు చేపట్టినా జల్లేరు రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీలకే అప్పట్లో పరిమితం చేశారు. ఇప్పుడు ఆ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు పెంచారు. దీని వల్ల అదనంగా భూసేకరణతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అందువల్లే దాని అంచనా వ్యయం పెరిగింది. ఇంత చిన్న విషయం మీకు తెలియదా రామోజీ?
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టులను కమీషన్లు కురిపించే కామధేనువుగా మల్చుకున్నారు. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆపై అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు.
2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు ఇదే లక్ష్యంగా సాగిన పాలనపై పల్లెత్తు పదం రాయని రామోజీ.. ఉల్టా చోర్ కొత్వాల్ కా డాంటే అన్నట్లు.. అంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఇప్పుడు రోత రాతలు రాస్తున్నారు. నిజంగా ఈ సామెత నాడు దోపిడీలో భాగస్వామియైన ‘ఈనాడు’ రామోజీకి అతికినట్లు సరిపోతుంది.
అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ
♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ 2013–14 ధరలతోనే పూర్తి చేస్తానని అంగీకరిస్తూ 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని 2015–16 ధరలను వర్తింపజేస్తూ రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. ఇదీ వంచన అంటే. అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ రామోజీ! అందులో రూ.2,917.78 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తన కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు చంద్రబాబు కట్టబెట్టడంతో అప్పట్లో మీరు నోరుమెదపలేదన్నది వాస్తవం కాదా రామోజీ?
♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మిగిలింది. ఆ కాంట్రా క్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసి, అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్‌కు అప్పగించింది ఎవరు? ప్రభుత్వ ఖజానా నుంచి రూ.వంద కోట్లకుపైగా దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నది చంద్రబాబు కాదా? దీనిని వంచన, దోపిడీ అనక ఇంకేమంటారు రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment