అసత్యం ప్రమాదకరమే. కానీ అర్థసత్యం అంతకన్నా ప్రమాదకరం. కానీ ‘ఈనాడు’ పత్రిక ఈ రెండింటినే ఆయుధాలుగా చేసుకుంది. వీటితోనే నిత్యం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై కుట్రలకు తెరతీస్తోంది. సోమవారం నాడు పతాక శీర్షికల్లో ‘రూ.948 కోట్ల మళ్లింపు?’’ అంటూ వండివార్చిన కథనం ఇలాంటి అర్థసత్యాల్లో భాగమే. పైపెచ్చు ఈ శీర్షికకు చివర్లో ప్రశ్నార్థకమొకటి!. అంటే... రాసిన రామోజీరావుకే సందేహం ఉందన్న మాట. మరి అంత సందేహం ఉన్నపుడు రాయటమెందుకు? పైపెచ్చు వార్త నిండా నిధుల మళ్లింపు జరిగిపోయిందన్నట్లుగా వ్యాఖ్యలు? ఇదెక్కడి పాత్రికేయం రామోజీరావుగారూ? ఇదేనా పత్రికను నడిపే తీరు? నిజానికి మీ వార్తలో ఆర్థిక సంఘం నుంచి ప్రభుత్వానికి నిధులు వచ్చాయన్నది మాత్రమే నిజం. కానీ మళ్లించారన్నది పచ్చి అబద్ధం. అందుకే మీరు, మీ అర్ధ సత్యాలు ఈ రాష్ట్రానికి అత్యంత హానికరం.
అంతవరకూ బాగానే ఉన్నా...
ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గరి నుంచీ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆయా సంస్థల పీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనూ ఇదే చేశారు. కాకపోతే ఇలాకాకుండా వాటి వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని కేంద్రం సూచించటంతో... అలా చేస్తే కనీసం ట్రెజరీ అధికారుల నియంత్రణ కూడా ఉండదని, నిధులు విడుదల చేసే ముందు బిల్లుల్ని పరిశీలించటం, తనిఖీ చేయటం ఏమాత్రం ఉండదని కాబట్టి దీన్ని ఏం చేయాలన్న విషయంలో పంచాయతీ రాజ్ శాఖతో ఆర్థిక శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది.
అక్రమాలను కనీసం తనిఖీ చేసే వీలుంటుంది కనక పీడీ ఖాతాలకే ఆర్థిక శాఖ మొగ్గు చూపుతుండగా... ఇలా చేస్తే మళ్లీ నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసే అవకాశం ఉందని, కాబట్టి వ్యక్తిగత ఖాతాలే బెటరని పంచాయతీ రాజ్ శాఖ సూచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఆలస్యమయ్యింది తప్ప... రామోజీ చెప్పినట్లు రూపాయి కూడా మళ్లించలేదు. అదీ నిజం.
విద్యుత్తు బిల్లులు చెల్లిస్తే తప్పా?
రామోజీరావు రాతలో మరింత ఘోరమైన సంగతేంటంటే ఈ నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపునకు వినియోగిస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేయటం!!. అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా రామోజీరావు గారూ? చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ పంచాయతీలు, స్థానిక సంస్థల బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు. పైపెచ్చు పీపీఏల పేరిట విద్యుత్తు రంగాన్ని నాశనం చేశారు. దాంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ.3వేల కోట్ల అప్పుల నుంచి రూ.19,900 కోట్ల అప్పుల్లోకి జారిపోయాయి.
స్థానిక సంస్థలు, పంచాయతీలైతే రూ.5వేల కోట్లకుపైగా బకాయిపడ్డాయి. విద్యుత్తు సంస్థలు కనక వాటి నిబంధనలు ప్రకారం బిల్లు కట్టని పంచాయతీలకు కరెంటు నిలిపేస్తే పరిస్థితేంటి? ‘‘అంధకారంలో పంచాయతీలు’’ ‘‘బిల్లులు చెల్లించని దుస్థితిలో పంచాయతీలు’’ అని మీరే పతాక శీర్షికల్లో వేస్తారుగా? మరి ఇప్పుడు పంచాయతీలకు నిధులు వచ్చినపుడు అవి వాడుకున్న కరెంటు తాలూకు బిల్లును ఆ డబ్బుల నుంచి చెల్లిస్తే మీకేంటి నొప్పి? పడిపోతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలను నిలబెట్టాలి కదా? ఆ మాత్రం కూడా బాధ్యతలేకుండా దౌర్భాగ్యపు రాతలెందుకు?
ఇదీ... పీడీ ఖాతాల కథ...
సాధారణ నిధులైతేనేం, ఆర్థిక సంఘం గ్రాంట్ల నిధులైతేనేం రాష్ట్ర విభజన నాటి నుంచీ... అన్నీ ఆయా స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే నిర్వహిస్తున్నారు. వాటి పీడీ ఖాతాల్లోని నిధుల లభ్యతను బట్టి గ్రామ పంచాయతీలు కానీ, స్థానిక సంస్థలు గానీ బిల్లులు సమర్పించడం... వాటిని క్లియర్ చెయ్యటం జరుగుతుంటుంది. ‘ఈనాడు’ చెప్పని నిజమేంటంటే... పంచాయతీలు అప్‌లోడ్ చేసే బిల్లులు సాధారణ నిధుల నుంచో, 14/15వ ఆర్థిక సంఘం నిధుల నుంచో పెద్దగా ఆలస్యం లేకుండా క్లియరవుతూనే ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సాధారణ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు రూ.381 కోట్ల విలువైన బిల్లులు చెల్లించగా... అదే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఏకంగా రూ.638.41 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఆర్థిక సంఘం నిధుల నుంచి గతేడాది రూ.313.48 కోట్ల బిల్లులు క్లియర్ చేయగా... ఈ ఏడాది 588.53 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఈ స్థాయిలో చెల్లింపులు పెరిగిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పదు.
కాకపోతే కొన్ని స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులు లేకపోవటంతో వాటికి బిల్లులు అప్‌లోడ్ చేయటంలో సమస్యలొస్తున్నది నిజమే. ఈ సమస్యలు కూడా ఎందుకంటే ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేస్తోంది. 2021–22కు సంబంధించిన రెండవ అంచె నిధులు 2022–23 రెండో త్రైమాసికంలో విడుదలయ్యాయి. ఇక 2022–23 మూడో త్రైమాసికంలోకి అడుగుపెట్టినా... ఈ ఏడాది తొలి అంచె నిధులింకా రాలేదు.
పైపెచ్చు చాలా గ్రామ పంచాయతీల్లో ఐదేళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తి పన్ను వసూళ్లలో ఆలస్యం కారణంగా పంచాయతీల నిధులు తగ్గిపోయాయి. వీటన్నిటికీ తోడు... డిస్కమ్‌లకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాష్త్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని స్వయంగా కేంద్ర ఆర్థిక సంఘమే ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీటన్నిటినీ ప్రస్తావించకుండా... విద్యుత్ బిల్లుల కింద మినహాయిస్తారేమోననే రెచ్చగొట్టే బాధ్యతారాహిత్యపు వార్తలు ఎవరికోసం రామోజీరావు గారూ?
అసలేం జరిగిందంటే...
2021–22 సంవత్సరానికి సంబందించి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఈ ఏడాది జూలై 29న కేంద్రం రూ.379 కోట్లు, ఆగస్టు 31న మరో రూ.569 కోట్లు మొత్తం రూ.948 కోట్లను విడుదల చేసింది. నిజానికి ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చికి ముందే రావాలి. కానీ కేంద్రం నుంచి ఆలస్యమయ్యాయి. ఆ నిధులు వచ్చిన 4 రోజుల్లోనే... వాటిని సంబంధిత స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) జారీ చేయగా... వాటికి అనుగుణంగా ఆగస్టు 4న పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి ఆ నిధుల విడుదలకు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేశారు. ఆ తరవాత వారం రోజులకే పంచాయితీ రాజ్ కమిషనర్ ఆ నిధుల్ని సంబంధిత స్థానిక సంస్థల వ్యక్తిగత ఖాతాల్లో జమచేసేందుకు ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment