24 గంటలు గడిచినా పట్టుబడ్డ డబ్బుకు ఆధారాలు చూపని ‘మార్గదర్శి’
అది ఎన్నికల్లో పంచే డబ్బే అన్న అనుమానాలకు బలం
పట్టుబడిన డబ్బు వివరాలు సీజర్స్ యాప్‌లో అప్‌లోడ్
తమ డబ్బే అని అప్పీల్ చేసుకున్న తర్వాత తదుపరి చర్యలు
ఆదాయపు పన్ను అధికారులకూ సమాచారం.. విచారణలో సరైన ఆధారాలు చూపించాల్సిందే
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అర కోటికి పైగా నగదు, చెక్కులతో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయి 24 గంటలు దాటినా ఇంతవరకు వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు తనిఖీల్లో ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు.
బుధవారం రాత్రి వరకు మార్గదర్శి సంస్థ ఉన్నతస్థాయి ఉద్యోగులెవరూ దానికి ఆధారాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును ఎన్నికల్లో పంపిణీ కోసం టీడీపీ నేతలకు అందించడానికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ నగదు వివరాలను సీజర్ యాప్‌లోకి అప్‌లోడ్ చేసి సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సీజర్స్ సిస్టమ్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా సీజర్స్ కమిటీ బృందం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. తమ డబ్బే అని మార్గదర్శి అప్పీల్ చేసుకున్న తర్వాత ఐటీ అధికారులకు సమాచారమిస్తామంటున్నారు. ఆధారాలు చూపించకపోతే డబ్బును సీజ్ చేసి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
సీతంపేట బ్రాంచి నుంచే..
ఈ నగదు మొత్తం సీతంపేట బ్రాంచి నుంచి తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ద్వారకానగర్ యూనియన్ బ్యాంక్‌కు తీసుకెళ్తున్నామని చెప్పిన మార్గదర్శి సిబ్బంది ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ చూపించలేదని జిల్లా సీజర్స్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సుధాకర్ తెలిపారు. నిజంగా ఇది వారి డబ్బే అయితే అప్పీల్‌కి దరఖాస్తు చేసుకుంటే.. ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు. రూ.10 లక్షలకు పైబడి నగదు దొరికితే ఐటీ అధికారుల సమక్షంలోనే విచారణ జరుపుతామని చెప్పారు. ఐటీకి, ఎన్నికల కమిషన్‌కు స్పష్టమైన ఆధారాలు చూపించిన తర్వాత అన్నీ పక్కాగా ఉంటే నగదు తిరిగి అప్పగిస్తామని, లేదంటే నగదు, చెక్కుల్ని సీజ్ చేసి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తారా?
సీతమ్మధారలో లీజుకు తీసుకున్న స్థలాన్ని కాజేసే కుట్రలో భాగంగా రోడ్డు విస్తరణలో స్థలానికి పరిహారం కోసం అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన చరిత్ర గురివింద రామోజీరావుది. అలాంటి డ్రామోజీ.. ఆధారాలు సమర్పించి నగదు తీసుకెళ్లకుండా, వేచి ఉండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా.. ఈ డబ్బు మార్గదర్శికి చెందింది కాదనీ, టీడీపీ నేతలకు అందించేందుకు తీసుకెళ్తున్న సొమ్మే అన్న అనుమానాలూ దృఢపడుతున్నాయి. డబ్బుని ఎలాగైనా దక్కించుకునేందుకు రామోజీరావు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడానికే ఇంత సమయం తీసుకుంటున్నారన్న వదంతులూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment