సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్‌లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు.
సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్‌ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది.
‘ఎగ్గోజ్’తో సంచలనం
ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్‌లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్‌తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ
కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్‌లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం..
బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్‌పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్
Comments
Please login to add a commentAdd a comment