
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తికి ఒకేచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని, తప్పుడు సమాచారంతో పక్క రాష్ట్రంలో ఉన్న వారు ఓటరుగా నమోదు చేసుకుంటే వారిపై పీపుల్స్ యాక్ట్ సెక్షన్–31 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న వారు ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడానికి డిసెంబరు 9 చివరి తేదీ అని, అభ్యంతరాలను 26లోగా పరిష్కరించి జనవరి 5, 2024న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఇక్కడ ఓటరుగా నమోదు చేయిస్తూ టీడీపీ ప్రత్యేకంగా శిబిరాలు పెట్టి చేరి్పస్తుండటంపై వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డిసెంబరు 5న ఇచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించి ఈ ఉత్తర్వులను జారీచేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ ఆదేశాలను జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసింది. ఎన్నికల కమిషన్ జారీచేసిన ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి..
♦ పీపుల్స్ యాక్ట్–1950 సెక్షన్ 17, 18 ప్రకారం ఒక ఓటరు ఒకచోట మాత్రమే నమోదై ఉండాలి. అలా కాకుండా ఒక చోటకు మించి వేరేచోట లేదా మరో ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకుంటే సెక్షన్–31 (పీపుల్స్ యాక్ట్ ) ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తారు.
♦ ఫాం–6 అనేది మొదటిసారి మాత్రమే నమోదు చేసుకునేవారు వినియోగించాలి. దీని ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా అప్పటికే ఓటరుగా నమోదు అయి ఉండకూడదు. తమకు ఎక్కడా ఓటు లేదంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇలా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వేరే నియోజకవర్గాల్లో లేదా వేరే ప్రాంతాల్లో ఓటు ఉన్నట్లు దర్యాప్తులో తేలితే వారిపై పీపుల్స్ యాక్ట్ సెక్షన్–31 ప్రకారం శిక్షించడం జరుగుతుంది. వయస్సు 20 ఏళ్లు దాటిన వారు ఫాం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే అలాంటి కేసుల విషయంలో అధికారులు విధిగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బీఎల్‌ఓలు కారణాలు రాయాలి.
♦ ఫాం–8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని అంశాలను విచారణ చేసి తీరాలని బూత్‌లెవల్ ఆఫీసర్లకు ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. వాటిలో సంబంధిత వ్యక్తి ఓటరు ఐడిని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్ సైట్‌లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్‌పై కామెంట్‌గా రాయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి.
వీటికి సంబంధించి బూత్ లెవల్ ఏజంట్ల నుంచిగాని ఇతరుల నుంచి సందేహాలు, అభ్యంతరాలుంటే బూత్ లెవల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి. వీటన్నింటిని అంటే డాక్యుమెంట్స్, ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు బీఎల్‌ఓలు బీఎల్‌ఏల రిమార్కులను పొందుపరిచిన అనంతరమే ఈఆర్‌ఓలు ఆ దరఖాస్తులపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
♦ దరఖాస్తుదారుడు తప్పుడు ధ్రువీకరణ/సమాచారం ఇచ్చినట్లు తేలితే వారిపై ఈఆర్వోలు పీపుల్స్ యాక్ట్–1950 కింద కేసులు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటారు.
ఈసీ నిర్ణయం హర్షణీయం: లేళ్ల అప్పిరెడ్డి
ఇక తమ ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ శుక్రవారం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేయడం హర్షణీయమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి ‘సాక్షి’తో అన్నారు. తెలంగాణ ఓటు వేసిన టీడీపీ మద్దతుదారులు ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకుని ఇక్కడ కూడా ఓటు వేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేయించటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని.. అది ఆయన నైజమన్నారు.
నిజానికి.. ప్రజాస్వామ్యంలో ఫాం–6 అనేది కొత్తగా ఓటర్లుగా నమోదుచేయడానికి ఉపయోగించేదన్నారు. అదే ఓటర్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చినట్లయితే ఫాం–8 ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని.. కానీ, ఫాం–6 ఉపయోగించి 30 సంవత్సరాల పైబడిన ఓటర్లను టీడీపీ నమోదు చేయిస్తోందన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం చంద్రబాబు చేయిస్తున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment