
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2021 ఓటర్ల జాబితాతో కాకుండా 2019 ఓటర్ల జాబితాతో నిర్వహించడం వల్ల 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోవడం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అఖిల న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు తోసిపుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని గుర్తుచేసిన న్యాయమూర్తి ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దామని, ఆ తరువాత అత్యవసర విచారణ గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలన్న మరో న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment