![Elephant killed by electric shock - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/06/12/gh.jpg.webp?itok=CIlH4eV8)
పలమనేరు (చిత్తూరు జిల్లా): విద్యుత్ షాక్‌తో ఓ గున్న ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది. కౌండిన్య అభయారణ్యంలోని 20 ఏనుగులు గుంపుగా గురువారం రాత్రి కోతిగుట్ట పొలాల్లోకి వచ్చాయి. గుంపులోని ఓ గున్న ఏనుగు విద్యుత్ స్తంభాన్ని బలంగా తగలటంతో స్తంభం విరిగి విద్యుత్ తీగలు మీద పడటంతో కరెంటు షాక్‌కు గురై అది మృతి చెందింది. శుక్రవారం దీన్ని గమనించిన రైతులు అటవీ శాఖకు సమాచారమిచ్చారు. పోలీసులతోపాటు డీఎఫ్‌వో రవిశంకర్, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఏనుగు మృతికి కారణాలను తెలుసుకుని ఏనుగుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన గున్న ఏనుగు వయసు మూడేళ్లు ఉంటుందని వారు తెలిపారు.
కరెంట్ తీగలు తెగి పడినప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో గుంపులోని మిగిలిన ఏనుగులకు ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి 10.00 గంటలప్పుడు ఈ ఘటన జరగ్గా చనిపోయిన గున్న ఏనుగు కోసం మిగతా ఏనుగులు శుక్రవారం వేకువజాముదాకా అక్కడే ఘీంకారాలు చేస్తూ ఉండిపోయాయని స్థానిక రైతులు తెలిపారు. ఏనుగు మృతి చెందిందనే వార్తతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పలువురు మహిళలు మృతి చెందిన ఏనుగుకు పూజలు చేశారు.
ఏనుగులు మళ్లీ వచ్చే ప్రమాదం!
గతంలో గొబ్బిళ్ళకోటూరు వద్ద విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గున్న ఏనుగు కోసం దాని తల్లి ఏనుగు మిగిలిన కరెంట్ స్తంభాలను ధ్వంసం చేసింది. ఆపై గున్న ఏనుగును పూడ్చిన చోట మిగిలిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ రోదించాయి. అదే విధంగా ఇప్పుడు గున్న ఏనుగు మృతి చెందటంతో కసి మీద ఉన్న ఏనుగులు మళ్లీ అదే చోటికి వస్తాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో రాత్రి పూట త్రీఫేజ్ కరెంటును నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment